రాయలసీమ : ఆళ్లగడ్డలో భగ్గుమన్న పాతకక్షలు..!!

FARMANULLA SHAIK
నంద్యాల జిల్లా ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డ లో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి.ఎన్నికలు ముగిసినా అల్లర్లు ఆగడంలేదు. అక్కడక్కడా కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో మరో ఘటన చోటుచేసుకుంది. నిన్నరాత్రి తెదేపా మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ పైన హత్యాయత్నం జరిగింది.తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు.ఏపీలో పోలింగ్ సందర్భంగా హింస పెద్దఎత్తున చెలరేగింది. తెలుగుదేశం , వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఆస్తులు ధ్వంసం చేసుకున్నారు. అన్నిచోట్ల ప్రత్యర్థుల మధ్య గొడవలు జరిగితే ఆళ్లగడ్డ లో మాత్రం ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్యే ఘర్షణ చోటుచేసుకుంది. ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు,నిప్పుగా మారిన మాజీమంత్రి భూమా అఖిలప్రియా, తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అధినేతకు ఇచ్చిన మాట ప్రకారం పోలింగ్ వరకు సంయమనం పాటించిన ఇరువర్గాలు ఓటింగ్ ముగిసిన వెంటనే కొట్లాటకు దిగారు. అఖిల ప్రియ బాడీగార్డుగా పనిచేస్తున్న నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి ఏవీ సుబ్బారెడ్డి వర్గమే కారణమని అఖిలప్రియ అనుమానిస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసే సందర్భంలో ఇరువర్గాలు పోటీపడ్డాయి. 

ఆ సమయంలో అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు అఖిలప్రియ బాడీగార్డుగా పనిచేస్తున్న నిఖిల్ ఏవీ సుబ్బారెడ్డిపై చేయిచేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కూడా వచ్చింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియ అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. ఈ వ్యవహారంపై అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇరువర్గాలను పిలిచి తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలు ముగిసే వరకు ఇరువర్గాలు సైలెంట్ కాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారని తెలిసింది. దీంతో ఇరువర్గాలు చాలా సైలెంట్గా ఎవరి ప్రచారం వారు చేసుకున్నారు. దెబ్బతిన్న అవమానం నుంచి తేరుకుని ఏవీ సుబ్బారెడ్డి అదునుకు ఎదురుచూశారు. ఆళ్లగడ్డలో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో పట్టరాని కోపంతో నిఖిల్పై దాడి చేయించినట్లు అఖిలప్రియవర్గం ఆరోపిస్తోంది. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఆళ్లగడ్డలో ఎలాంటి గొడవలు జరగలేదని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటుంటే...ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఇరువురు నేతలు ఏకంగా దాడులు చేసుకోవడం చూస్తే మళ్లీ భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ దాడులు ఏ స్థాయిలోకి వెళ్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న భూమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు....నాగిరెడ్డి మరణానంతరం విడిపోయాయి. బినామీ ఆస్తులు, పదవుల పంపకాలే విభేదాలకు కారణమని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: