ఆ సౌండ్ వస్తేనే ఓటు వేసినట్టు.. ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

Reddy P Rajasekhar
రెండు తెలుగు రాష్ట్రాలలోని ఓటర్లు సోమవారం రోజున ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. పోలింగ్ స్లిప్, గుర్తింపు కార్డ్ సహాయంతో సులభంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. పోలింగ్ బూత్ లో ఓటు వేసేవాళ్లు కొన్ని విషయాల గురించి అవగాహన కలిగి ఉంటే ఓటు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
 
పోలింగ్ బూత్ కు వెళ్లగానే పోలింగ్ స్లిప్ ను చూపించాలి. పోలింగ్ స్లిప్ లేని వాళ్లు ఓటర్ సీరియల్ నంబర్ చెప్పడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటర్ వివరాలన్నీ సరిగ్గా ఉంటే పోలింగ్ అధికారి ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. ఆ తర్వాత వివరాలను ఫారం 17a లో నమోదు చేయడం జరుగుతుంది. అనంతరం ఓటర్ జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు.
 
వేలి ముద్ర లేదా సంతకం చేసిన తర్వాత ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్టుమెంట్ కు వెళ్లడానికి అనుమతి లభిస్తుంది. ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు, పక్కన నీలిరంగు బటన్ ఉంటాయి. నీలి రంగు బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే ఓటు నమోదైనట్లు భావించాలి. బటన్ నొక్కిన తర్వాత ఐదు సెకన్ల పాటు చిన్న శబ్దం వినిపిస్తుంది. ఈ బీప్ సౌండ్ వస్తే మాత్రమే మీరు ఓటు వేసినట్టు ఆ ఓటు నమోదైనట్టు అర్థం చేసుకోవాలి.
 
బీప్ సౌండ్ వినిపించిన తర్వాత వీవీ పాట్ మెషీన్ పై పచ్చటి లైట్ వెలుగుతుంది. ఆ తర్వాత వీవీ పాట్ పై ఉండే స్క్రీన్ పై ఓటేసిన అభ్యర్థి గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమ సంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్ల పాటు కనిపిస్తాయి. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండు ఈవీఎంలతో పాటు రెండు వీవీ పాట్ లు ఉంటాయి. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: