ఏపీలో 75 శాతం స్థానాల్లో కూటమిదే విజయమా.. ఆ సర్వే ప్రకారం సీట్ల లెక్క ఇదే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అనుకూల ఫలితాలు వస్తాయా? లేక వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయా? అనే ప్రశ్న భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. 40 నుంచి 50 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండటం ఈ స్థానాలే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే అవకాశం ఉండటంతో కూటమి గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో తెలియడం లేదు. సర్వేల ఫలితాలను బట్టి ఎన్నికల ఫలితాలను అంచనా వేయాలని భావిస్తున్నా ఒక్కో సర్వే ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంది.
 
100 స్థానాలకు మించి అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు మాత్రం అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో 75 శాతం స్థానాల్లో కూటమిదే విజయమంటూ ప్రముఖ సంస్థ సర్వే ఫలితాలను ప్రకటించింది. సోషల్ మూవ్ అనే సంస్థ ప్రకటించిన ఫలితాల ప్రకారం ఏపీలో కూటమి 132 నుంచి 139 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించడం గమనార్హం.
 
అదే సమయంలో వైసీపీకి 36 నుంచి 43 స్థానాలలో మాత్రమే అనుకూల ఫలితాలు వస్తాయని ఈ సర్వేలో తేలింది. కాంగ్రెస్, ఇతరులు ఏపీలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే ఛాన్స్ అయితే లేదని ఈ సర్వేతో మరోసారి తేలిపోయింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 1200 మంది ఓటర్ల అభిప్రాయం తెలుసుకుని నాలుగు వారాల పాటు సర్వే చేసి ఈ ఫలితాలను ప్రకటించినట్టు సోషల్ మూవ్ సంస్థ  తెలిపింది.
 
అయితే ఈ సర్వే ఫలితాలు నిజం అవుతాయో లేదో తెలియాలంటే మరో నెలరోజులు ఆగక తప్పదు. మే నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనుండగా జూన్ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 4వ తేదీన ఏపీ ప్రధాన రాజకీయ నేతల భవిష్యత్తు తేలిపోనుంది. ఇప్పటికే మేనిఫెస్టోలను ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీకి ఓటేయాలో ఓటర్లు నిర్ణయం తీసుకుని తమకు నచ్చిన రాజకీయ పార్టీని గెలిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: