తరతరాలుగా మోసపోతున్న సీమవాసులు.. ఈ నేతలకు హంద్రీనీవా కనిపించడం లేదా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరతరాలుగా సీమవాసులు మోసపోతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 90 శాతం హంద్రీనీవా ప్రాజెక్ట్ పనులు పూర్తి కాగా గడిచిన 15 సంవత్సరాలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి కాలేదంటే హంద్రీనీవా విషయంలో నేతలు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారో అర్థమవుతుంది. హంద్రీనీవాను చివరకు విఫల ప్రాజెక్ట్ గా మారుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్ట్ అసంపూర్తి పనులను పూర్తి చేస్తే కర్నూలు జిల్లాలో 61 వేల ఎకరాలకు పుష్కలంగా సాగు నీరు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇతర రాయలసీమ జిల్లాల ప్రజలకు సైతం సాగు, తాగునీటి కష్టాలు తీరతాయి. పనులు పూర్తి చేస్తే కరువు సీమ సస్యశ్యామలం అవుతుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కు 1983 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ రూపకల్పన చేశారు.
 
2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిధులు మంజూరు చేసి పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చారు. 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించాలనే సదుద్దేశంతో హంద్రీనీవా పనులు మొదలయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా ప్రధాన రాజకీయ నేతల నుంచి, అధికారంలో ఉన్న పార్టీల నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ నిర్లక్ష్యం వల్లే హంద్రీనీవా పూర్తి కాలేదని ఎలాంటి సందేహం అవసరం లేకుండా చెప్పొచ్చు.
 
వచ్చే ఐదేళ్లలో అయినా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీమ రైతులు కోరుకుంటున్నారు. హంద్రీనీవా పూర్తైతే కరువు సీమలో మళ్లీ రైతు రాజ్యం మొదలవుతుందని చెప్పవచ్చు. హంద్రీనీవా పూర్తైతే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఏకంగా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుందని సమాచారం అందుతోంది. హంద్రీనీవాను అటు టీడీపీ, ఇటు వైసీపీ స్వార్థపూరిత రాజకీయాల కోసం వాడుకుంటూ హంద్రీనీవా క్రెడిట్ తమ పార్టీకే దక్కాలనేలా విమర్శలు చేయడం గమనార్హం.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: