ఆ సెంటిమెంట్ ప్ర‌కారం వ‌సంత కృష్ణప్ర‌సాద్‌కు మంత్రి ప‌ద‌వి.. మ‌రి దేవినేని ఉమా ఏం అవుతాడు..?

RAMAKRISHNA S.S.
 విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పుడు గొంతు వినిపించిన మాజీ మంత్రి.. దేవినేని ఉమాకు అసలు సీటు లేకుండా పోతుందని ఎవరు ఊహించలేదు. విచిత్రం ఏంటంటే గత ఎన్నికలలో తనపై గెలిచిన తన కుటుంబ చిరకాల రాజకీయ ప్రత్యర్థి.. వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చి దేవినేని ఉమా సీటు కొట్టేశారు. ముందు దేవినేని కాస్త అలిగినా.. చంద్రబాబు సర్ది చెప్పడంతో చివరకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు వసంత గెలుపు కోసం దేవినేని కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే మైలవరం నియోజకవర్గంలో గెలిచిన ముగ్గురు నేతలకు చాలా కాలం పాటు మంత్రి పదవులు దక్కాయి. గతంలో కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు గెలిచిన దివంగత సీనియర్ నేత చనుమోలు వెంకట్రావు ఏకంగా మూడుసార్లు మంత్రి అయ్యారు.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు నేతలకు కూడా చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. ఉయ్యూరు నుంచి మైలవరం వలస వచ్చిన వడ్డే శోభనాద్రిశ్వరరావుకు 1999లో ఇక్కడ నుంచి విజయం సాధించగా.. ఆయనకు చంద్రబాబు తన ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక 2009, 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన దేవినేని ఉమామహేశ్వర రావుకు 2014లో చంద్రబాబు కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు. అలా మైలవరం నియోజకవర్గం గత 30 సంవత్సరాలలో ఏకంగా ముగ్గురు వ్యక్తులకు మంత్రి పదవులు దక్కేలా చేసింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే పాత సెంటిమెంట్ ప్రకారం ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందా ? అని ఆయన అనుచరులు కొత్త చర్చకు తెరలేపారు. మరి పార్టీ మారి టీడీపీలోకి వచ్చి పైగా దేవినేని ఉమా సీటు తీసుకుని పోటీ చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్‌కు మంత్రి పదవి వస్తే... సీటు త్యాగం చేసిన దేవినేని ఉమా పరిస్థితి ఏంటన్న ? చర్చ కూడా పార్టీలో మొదలైంది. మరో చర్చ ప్రకారం ఈసారి సీటు వదులుకుంటే.. ఉమాకు ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు మంత్రి పదవి చేస్తానని హామీ ఇచ్చారని.. అందుకే ఉమా సీటు వదులుకున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు అనంతర పరిణామాలు కాస్త ఆసక్తిగా మారాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: