ఏపీ: సేమ్ టు సేమ్... అక్కడ మాయావతి, ఏపీలో షర్మిల?

Suma Kallamadi

ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఎవరి ఆట వారు ఆడుతున్నారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే కొన్ని పార్టీల అధినేతలు బీజేపీకి కొమ్ముకాస్తున్నాయని ఓ వర్గం వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి విజయావకాశాలకు గండి కొడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో మాయావతి పూర్తిగా బీజేపీకి లాభం చేకూర్చేలా తన గేమ్ ప్లాన్ అమలు చేస్తోందని అనుమానిస్తున్నారు. బీఎస్పీ తరపున ముస్లింలకు అత్యథికంగా సీట్లు కేటాయించడమే దానికి గల ప్రధాన కారణం. కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎస్పీ అభ్యర్థులే టార్గెట్ గా బీఎస్పీ అభ్యర్థులు ఓట్లు చీల్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉండగా ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ అక్కడ 13 స్థానాల్లో, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడ బీఎస్పీ ఈసారి ఏకంగా 18మంది ముస్లింలకు సీట్లిచ్చింది. ఇక్కడ వీరి టార్గెట్ ఒక్కటే. ఇండియా కూటమికి వచ్చే ఓట్లను చీల్చి, పరోక్షంగా బీజేపీకి సాయపడటం. ఇక్కడ ఏపీలో కూడా షర్మిల ఇంచుమించుగా అదే పాత్ర పోషిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇక్కడ చంద్రబాబు ఆడిన గేమ్ ఆడుతోంది. అందుకే ఆమె వైసీపీకి వెన్నుపోటు పొడిచేలా, చంద్రబాబుకి మేలు జరిగేలా ఏపీలో రాజకీయాలు చేస్తోందని ఓ వర్గం భావిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లలో 17 సీట్లు ముస్లిం అభ్యర్థులకు కేటాయించారు షర్మిల. వీరి టార్గెట్ ఒక్కటే, వైసీపీ ఓటు బ్యాంక్ ని నిట్టనిలువునా చీల్చేయాలి, టీడీపీ కూటమి అభ్యర్థులకు మేలు చేయాలి.
అయితే ఇదంతా  బీజేపీ మైండ్ గేమ్ అనేవారు కూడా లేకపోలేదు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు పోటీగా ముస్లిం అభ్యర్థి అలీ ఖాన్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసినదే. ఇక ఇక్కడ టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి చీల్చితే అక్కడ టీడీపీ అభ్యర్థి లాభపడే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా కర్నూలులో వైసీపీ ఇంతియాజ్ అహ్మద్ కి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ జిలానీ భాషాను తెరపైకి తెచ్చింది. ఓట్లు చీలి ఇక్కడ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ లాభపడే అవకాశం లేకపోలేదు. అలా ఆమె ఏకంగా 17మందికి టికెట్లు ఇచ్చి పోటీకి నిలబెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: