ఏపీ: వారితో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయించే బాధ్యత నాది: జనసేనాని

Suma Kallamadi

ఏపీలో ఎన్నికల వేళ ప్రచార సభలో మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ప్రత్యర్థులపై చెలరేగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే వైకాపా ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లతో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయించే బాధ్యత నాదే!" అంటూ హెచ్చరించారు. కాకినాడ వారాహి విజయభేరీ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వలన వైసీపీలో గుబులు మొదలయ్యింది.
ప్రజల కోసం బతకాలి అనే ఒకే ఒక్క స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని ఈ సందర్భంగా అన్నారు. మొన్నటి వరకూ డొక్కు స్కూటర్‌పై తిరిగే కన్నబాబు ఇవాళ్ల పెద్ద నాయకుడు అయిపోయాడని, వెయ్యి కోట్ల రూపాయలకు పడగలు ఎలా ఎత్తాడో వివరాలు చెప్పాలని ప్రశ్నించాడు జనసేనాని. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్ద కాలానికి పైగా నలిగిపోయానని చెప్పారు. ప్రతి ఒక్క వెధవతో మాటలు పడ్డానని పవన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న చిరంజీవి వల్లే కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాల వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటూ మండిపడ్డారు.
నాడు చిరంజీవిని వారు దారుణంగా అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయం అని అయినా చిరంజీవి ముందుకు వచ్చారని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ... "అపుడు చిరంజీవి, మహేశ్ బాబును ప్రభాస్‌ను జగన్ కేవలం అహంకారంతో పిలిపించారు. వారిని కూర్చోబెట్టి మరీ నన్ను బతిమాలండి అన్నట్టు చెప్పి దాన్ని వీడియో తీయించారు. ఆ వీడియోను బయటకు రిలీజ్ చేశారు. కన్నబాబు! ఒక్కటే అడుగుతున్నా... సిగ్గుందా కన్నబాబు నీకు.. ఏం నీచపు బతుకు నీది? ఆ నీచుడు చిరంజీవిని అవమానిస్తుంటే సిగ్గుగా అనిపించలేదా? నీకు చిరంజీవి పెట్టిన రాజకీయ భిక్ష గుర్తుకు రాలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: