దెందులూరులో గెలుపుపై ఒక్కొక్క‌డికి న‌రాలు క‌ట్ అయిపోతున్నాయ్‌...!

RAMAKRISHNA S.S.
- చింత‌మ‌నేని అబ్బ‌య్య చౌద‌రి హోరాహోరీ పోరు
- ఇప్ప‌టికే కోట్ల‌లో బెట్టింగులు... మండ‌లాల వారీగా మెజార్టీ లెక్క‌లు
- టైగ‌ర్ ప్ర‌భాక‌ర్‌కు చావోరేవోగా ఈ ఎన్నిక‌.. రెండో గెలుపుపై అబ్బ‌య్య గురి
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం ఒకటి. దెందులూరు పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు చింతమనేని ప్రభాకర్. దెందులూరును తన కేంద్రంగా చేసుకొని రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలోనే తిరుగులని మాస్ లీడర్ గా ఎదిగారు ఆయన. చింతమనేని గత ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయంగా చాలా జూనియర్ అయిన కొఠారు అబ్బయ్య చౌదరిపై ఓడిపోయారు. చింతమనేని చరిష్మా ఆయనకు ఉన్న క్రేజ్‌తో పోలిస్తే అబ్బాయ్య‌ చౌదరి తేలిపోతారు అని అనుకున్నారు.

గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందే లండన్ నుంచి వచ్చిన అబ్బాయ్య‌ చౌదరి గెలిచాక.. వివాదాలకు దూరంగా ఉంటూ రాజకీయం చేశారు. చింతమనేని ఎన్ని కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా మాట తూలతారు అన్న ముద్ర పడిపోయింది. ఈ విషయంలో అబ్బ‌య్య‌ చౌదరి సౌమ్యంగా ఉండటం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఐదేళ్ల‌లో దెందులూరులో రాజ‌కీయంగా పట్టు సాధించారు. లేకపోతే అసలు చింతమనేనికి అబ్బయ్య చౌదరి ఈ ఎన్నికల్లో పోటీయే కాదన్నట్టుగా వాతావరణం ఉండేది. ఏలూరు చుట్టూ దెందులూరు నియోజకవర్గం విస్తరించి ఉంటుంది. దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తాయి. అన్ని కులాల ఓట‌ర్లు ఉన్నా రాజకీయంగా కమ్మ‌ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ.

ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే.. 14 సార్లు కమ్మనేతలే, ఎమ్మెల్యేలు గెలిచారు. గత ఎన్నికలలో అబ్బయ్య చౌదరి 16 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అంతకుముందు రెండు ఎన్నికలలోను చింతమనేని రెండుసార్లు కూడా 15, 17 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈసారి అబ్బయ్య‌ చౌదరి చింతమనేని మధ్య నరాలు తెగే రేంజ్ లో హోరాహరి పోరు సాగుతోంది. అభివృద్ధి పరంగా పోల్చి చూస్తే చింతమనేని ముందు అబ్బయ్య‌ చౌదరి పూర్తిగా తేలిపోయారు. ఐదేళ్లలో అబ్బ‌య్య‌ చౌదరి సైలెంట్ గానే ఉంటూ తాను మంచివాడిని అనిపించుకునే ప్రయత్నం చేసినా.. ఆయన తండ్రి కొఠారు రామచంద్రరావు షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పారని.. ఇసుక దందాతో పాటు మట్టి దందాలు చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి.

ఇక అబ్బయ్య‌ చౌదరి పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు.. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్... సాధారణ ప్రజలపై ఎన్నో కేసులు పెట్టి వేధించారన్న విమర్శలు ఉన్నాయి. ఇక చింతమనేని రాజకీయంగా ఎదుర్కోలేక కేసులతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆయనపై ఐదేళ్లలో 70కి పైగా కేసులు పెట్టించారన్న సానుభూతి చింతమనేనికి వచ్చింది. ఇక చింతమనేని విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనను గట్టిగా టార్గెట్ చేయడంతో పాటు.. రకరకాల కేసులు పెట్టి జైలులో పెట్టటం.. ఇవన్నీ ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి కలిగేలా చేశాయి.

చింతమనేని గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా తన దూకుడు స్వభావం తీరు మార్చుకోలేదు. తాను ఇలాగే ఉంటానని ఓపెన్ గానే చెబుతున్నారు. ఆయన దూకుడు వల్ల కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. అయితే ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ టైంలో అయినా ఆదుకుంటారన్న పేరు.. ఆయన వివాదాలు వ్యక్తిగత కోణంలో కాకుండా ప్రజల కోణంలో ఉంటాయన్న పేరు.. గత ఎన్నికల్లో ఓడిపోవడం.. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులతో చింతమనేని పై సానుభూతి ఉంది. ఏదేమైనా ఈసారి దిందులూరు లో చాలా హోరాహోరీ అయితే సాగుతోంది. ఎవరు గెలిచినా మెజార్టీ చాలా స్వల్పంగా ఉంటుందన్న అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: