కుప్పంలో భ‌ర్త బాబు గెలుపు కోసం భార్య భువ‌నేశ్వ‌రి పాట్లు చూశారా...?

RAMAKRISHNA S.S.
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంది?  ప్ర‌స్తు తం ప్ర‌చారం  ఏ రేంజ్‌లో ఉంది? అని అంటే.. వైసీపీ పేరు ముందుగా వినిపిస్తోంది. వైసీపీ నుంచి ఒక‌రు కాదు. ఇద్ద‌రు కాదు.. సీమ ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది కీల‌క నాయ‌కులు.. అధికార ప్ర‌తినిధులు కూడా.. ఇక్క‌డ ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. ఇంటింటి ప్ర‌చారాన్ని కూడా ముమ్మ‌రం చేశారు. ఒక్క‌టే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చంద్ర‌బాబును ఓడించాల‌న్నదే క‌సి.. ! గ‌త ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా ఇక్క‌డ గెలిచారు. క‌ట్ చేస్తే ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది రాష్ట్ర వ్యాప్తంగానే ఆస‌క్తి గా మారింది.

మ‌రి  టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. గత ఆరు మాసాల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు 12 సార్లు ప‌ర్య‌టించారు. ఇక్క‌డ ప్ర‌జ‌లతో మ‌మేక‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని.. సొంత స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. ఇటీవ‌ల అంత‌ర్గ‌తంగా జ‌రిగిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో కూడా.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత త‌క్కువ ఎడ్జ్‌లోనే చంద్ర‌బాబు ఉన్నార‌ని పార్టీ నాయ‌కులు చెప్పుకురావ‌డం గ‌మ‌నార్హం.

దీంతో కుప్పంపై ఇప్పుడు నారా చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఆమె ఇక్క‌డే నివాసం ఉంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆమె ఇంటింటికీ ప్ర‌చారం చేస్తున్నారు. అతేకాదు.. కీల‌క‌మైన హామీ లు కూడా ఇస్తున్నారు. పార్టీ ప్ర‌క‌టించే మేనిఫెస్టోకు స‌మాంత‌రంగా.. భువ‌నేశ్వ‌రి కూడా.. మేనిఫెస్టోను ఇచ్చారు. దీని ప్ర‌కారం.. ఇక్క‌డ చంద్ర‌బాబును గెలిపిస్తే.. తానే స్వ‌యంగా అంద‌రి బాబోగులు చూసుకుంటాన‌ని చెబుతున్నారు.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా సేవ‌లు అందిస్తామ‌న్నారు. అంతేకాదు.. మండ‌లాల స్థాయిలో అత్య‌ధికంగా మెజారి టీ వ‌చ్చిన మండ‌లాల‌ను.. తాను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తాన‌ని చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఇంటికీ కుళాయి ఇవ్వ‌డంతోపాటు.. వంట గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేసి.. మ‌హిళ‌ల క‌ష్టాలు త‌ప్పిస్తాన‌ని చెబుతున్నారు. మ‌హిళ‌లకు సాధికార‌త క‌ల్పించేలా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి.. ఇక్క‌డ వృత్తుల్లో శిక్ష‌ణ ఇస్తామ‌ని భువ‌నేశ్వ‌రి వాగ్దానం చేస్తున్నారు. మొత్తంగా.. భువ‌నేశ్వ‌రి బాగానే ఎఫ‌ర్ట్ పెడుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: