క‌ర్నాట‌క‌లో నీళ్లు కట్ ... తెలంగాణ‌లో బ‌స్సు క‌ట్‌..!

RAMAKRISHNA S.S.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి రోజు రోజుకూ రాజుకుంటున్నది. ఏ పార్టీకి అయినా ఎన్నికలలో గెలవడమే లక్ష్యం. ఇక కాంగ్రెస్ లాంటి పార్టీలలో ఎన్నికలలో ఓటమికి గురైతే నాయకుల సీట్లు కదిలిపోతాయి. ముఖ్యమంత్రుల పీఠాలు కూలిపోతాయి. అందుకే గెలుపే లక్ష్యంగా జరుగుతున్న ప్రచారాల్లో నేతల స్వరాలు మారుతున్నాయి. గత ఏడాది మే 10న కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం గత రెండు నెలలుగా బెంగుళూరు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి  పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  డీకే శివకుమార్ ను సోదరుడి నియోజకవర్గంలోని హౌసింగ్ సొసైటీ నివాసితులు కలిశారు.  ఈ సంధర్భంగా ‘’నా సోదరుడికి ఓటు వేస్తే  కావేరీ నదీజలాలను సరఫరా చేస్తాం. నేను ఇక్కడ నీటి మంత్రిని ఓట్లేయకుంటే నీటి ఇక్కట్లు తప్పవు’’ అని చెప్పడం వివాదంగా మారింది. దీనిని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది.
తాజాగా తెలంగాణలో యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘’పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బంద్ అవుతుంది’’ అని చెప్పడం వివాదం రేపుతున్నది. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో 13 అంశాలు అమలుచేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలలో గెలిచాక మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేస్తున్నారు.
మిగిలిన గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో దాటవేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించకుంటే ఉన్న పథకం ఆగిపోతుందని హెచ్చరించడం గమనార్హం. కర్ణాటకలో నీళ్లు బంద్ .. తెలంగాణలో బస్సు బంద్ అన్న హెచ్చరికలు ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: