ఉమ‌న్ Vs ఉమ‌న్‌: అక్క‌డ మూడు ఎన్నిక‌ల్లోనూ మ‌హిళ‌లే మ‌ధ్యే ఫైట్‌... వాళ్ల‌కు మ‌హిళే ఎమ్మెల్యే..!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం రంప‌చోడ‌వ‌రంలో ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య పోరు ఆస‌క్తిగా మారింది. ప్ర‌ధాన పార్టీల నుంచి అభ్య‌ర్తులుగా  ఇద్ద‌రూ మ‌హిళ‌లే రంగంలోకి దిగ‌డం.. వీరిలో ఒక‌రు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కావ‌డంతో రాజ‌కీయంగా ఆస‌క్తి నెలకొంది. 2019లో ఇక్క‌డ తొలిసారి ఇద్ద‌రు మ‌హిళా అభ్య‌ర్థులు పోటీ చేయ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ నుంచి నాగుల ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి బ‌రిలో నిల‌వ గా.. వైసీపీ నుంచి బ‌య‌టకు వ‌చ్చి టీడీపీలో చేరిన వంత‌ల రాజేశ్వ‌రి  ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు.

క‌ట్ చేస్తే.. వైసీపీ అభ్య‌ర్థిన నాగుల‌ప‌ల్లి ధ‌నల‌క్ష్మి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇద్ద‌రు మ‌హిళ‌లు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది కూడా ఒక‌టి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి బ‌రిలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 98 వేల పైచిలుకు ఓట్లు ద‌క్కించుకున్న ల‌క్ష్మి.. ఇప్పుడు కూడా అంత‌కుమించిన ఓట్లు వ‌స్తాయ‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. పైగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను త‌న‌ను గెలిపిస్తాయ‌ని చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా టీడీపీ నుంచి మిర్యాల శిరీష్‌కు ఆ పార్టీ అవ‌కాశం ఇచ్చింది. ఈమె కూడా.. స్థానికం గా ప‌ట్టున్న నాయ‌కురాలే.అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగులప‌ల్లి ముందు ఏమేర‌కు త‌ట్టుకుని నిలుస్తార‌నేది ప్ర‌శ్న‌గా మారింది. తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న శిరీష‌.. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ఆమె కూడా.. అంచ‌నాలు బాగానే పెట్టుకున్నారు. గెలుపుపై నిమ్మ‌కంతో ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. 2008లో ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. రెండు సార్లు మ‌హిళ‌లే విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు.. ఇరు ప్ర‌ధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు ఇద్ద‌రూ కూడా మ‌హిళా నాయ‌కులే కావ‌డం మ‌రో విశేషం. ఇక‌, పార్టీపరంగా చూసుకుంటే.. వైసీపీలో క‌లివిడి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకేటికెట్ ఇవ్వ‌డం.. ఎవ‌రిలోనూ అసంతృప్తి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీలో మాత్రం టికెట్ ఆశించిన వంత‌ల రాజెశ్వ‌రికి టికెట్ రాలేదు. దీంతో ఆమె వ‌ర్గం ప్ర‌చారానికి, పార్టీకి కూడా దూరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: