25 ఏళ్ల టీడీపీ కంచుకోటను కూల్చిన కంగాటి శ్రీదేవి.. తప్పులు సరిదిద్దుకుంటే తిరుగులేదా?

Reddy P Rajasekhar
కొన్నేళ్ల క్రితం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. వరుసగా ఐదుసార్లు పత్తికొండలో టీడీపీ జెండా ఎగిరిందంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభావం ఏ స్థాయిలో ఉందో సులువుగానే అర్థమవుతుంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్ వల్ల టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన కంగాటి శ్రీదేవి టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబుపై ఏకంగా 43 వేల మెజార్టీతో విజయం సాధించారు.
 
2019 ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో కంగాటి శ్రీదేవి పేరు ఏపీ రాజకీయాల్లో మారుమ్రోగింది. భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య అనంతరం శ్రీదేవి అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ హవాతో పాటు భర్త మరణం సెంటిమెంట్ కలిసొచ్చి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీదేవి పత్తికొండ నియోజకవర్గంలో మళ్లీ గెలుపు నాదే అని కామెంట్లు చేశారు.
 
టీడీపీ తరపున ఈ ఎన్నికల్లో కూడా కేఈ శ్యాంబాబు పోటీ చేస్తుండగా సర్వేలలో పత్తికొండలో వైసీపీకే అనుకూలంగా ఫలితాలు వస్తాయని వెల్లడైంది. అయితే గత ఐదేళ్లలో పత్తికొండ నియోజకవర్గం ప్రజలలో శ్రీదేవిపై కొంతమేర వ్యతిరేకత పెరిగింది. శ్రీదేవి అనుచరులు చేస్తున్న ఆగడాల వల్ల ఆమెపై వ్యతిరేకత పెరగగా పలు వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
 
నియోజకవర్గంలోని మండలాల్లో ఎమ్మెల్యే బంధువర్గమే ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుని శ్రీదేవి ముందుకెళ్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ చేసిన సర్వేలలో సైతం శ్రీదేవికి అనుకూలంగా ఫలితాలు రాకపోయినా జగన్ మాత్రం మరోసారి ఆమెకే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో శ్రీదేవి గెలిచినా మెజారిటీ మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేఈ శ్యాంబాబు, శ్రీదేవి పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా జూన్ 4వ తేదీన ఏ అభ్యర్థికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: