బాబు - బీజేపీ పెద్ద క‌న్‌ఫ్యూజ్ కామెడీ చూశారా...?

RAMAKRISHNA S.S.

ఏపీ ఎన్నికలలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అభ్యర్థుల ఖరారు అంశం ఎంతకూ తెగడం లేదు. పలు స్థానాలలో అభ్యర్థుల ఖరారు విషయంలో ఆయా పార్టీలు చేస్తున్న కాలయాపన మూలంగా పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. మొన్నటిదాకా ఉండి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కొనసాగిన గందరగోళం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి పాకింది.

ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆసక్తిగా ఉన్నాడు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయనను బీజేపీలో చేరి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం పెద్దలతో పాటు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ బలంగా ఉన్న స్థానాన్ని బీజేపీకి కేటాయించి అందులో చేరి పోటీచేయమని వత్తిడి చేయడం ఏంటని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తున్నది.

అనపర్తిలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ఆ పార్టీ నుండే పోటీ చేస్తానని, లేదంటే రాజకీయాల నుండే తప్పుకుంటానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో అనుచరులు, కార్యకర్తలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాలని, తాము కష్టపడి గెలిపించుకుంటామని రామకృష్ణారెడ్డికి వారు భరోసా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉంది ? ఎవరిని బరిలోకి దింపితే గెలుపు సాధ్యం అవుతుంది ? అన్న విషయాల మీద ఒక స్పష్టత లేకపోవడం మూలంగానే కూటమి పార్టీల అభ్యర్థుల ఖరారులో గందరగోళం నెలకొందని క్షేత్రస్థాయి లో పార్టీల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అనపర్తి విషయంలో బీజేపీ, టీడీపీ అధిష్టానాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి ? ఏ నిర్ణయం తీసుకుంటాయి ? అన్నది వేచిచూడాలి..అటు బిజెపి , టిడిపి మధ్య కొనసాగుతున్నటువంటి ఈ కన్ఫ్యూజన్ వల్ల చాలామంది నేతలు కూడా నవ్వుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: