ప‌వ‌న్‌పై చంద్ర‌బాబు పొగ‌డ్త‌ల వెన‌క ఇంత లాజిక్ ఉందా..?

RAMAKRISHNA S.S.
గ‌త మూడు రోజులుగా రాష్ట్రంలో కూట‌మి(బీజేపీ+జ‌న‌సేన‌+టీడీపీ)  పార్టీల త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్న ప్ర‌జా గ‌ళం స‌భ‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తు న్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని త‌ణుకు, నిడ‌ద‌వోలు, పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌భ‌ల్లో ప‌వ‌న్‌పై చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. సుమారు ప‌ది నిమిషాల పాటు... ప‌వ‌న్‌ను ఆయ‌న ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. గ‌తంలో ఇంత స్థాయిలో చంద్ర‌బాబు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసింది లేదు.

మ‌రి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నార‌నేది ప్ర‌శ్న‌. దీనిపై రెండు ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఒక‌టి.. ప‌వ‌న్ పొత్తులు క‌లిపేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ విష‌యాన్నిఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. అనేక తిట్లు తిన్నాన‌ని కూడా చెప్పారు. అయితే.. పొత్తులు కుదిరిన త‌ర్వాత‌.. జ‌న‌సేన‌లోని ఓ సామాజిక వ‌ర్గం.. ప‌వ‌న్ కు ద‌క్కాల్సినంత మ‌ర్యాద ద‌క్క‌డం లేద‌ని.. సీట్ల విష‌యంలోనూ.. ఆయ‌న‌కు ఇచ్చే గౌర‌వ మ‌ర్యాద‌ల విష‌యంలోనూ ఆశించింది ఏమీ జ‌ర‌గ‌లేద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు.

ఇటీవ‌ల పొత్తుల పై పోతిన మ‌హేష్ కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తు ధ‌ర్మం అంటే..జ‌న‌సేన మాత్ర మే త్యాగాలు చేయాలా?  జ‌న‌సేన మాత్ర‌మే సీట్లు వ‌దులుకోవాలా?  చంద్ర‌బాబు చెప్పిందే వినాలా?  అని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌లు కొట్టిపారేసేవిగా అయితే లేవు. పైకి అంద‌రూ మౌనంగా ఉన్నా.. పోతిన చేసిన వ్యాఖ్య‌ల‌పై అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు జరుగుతున్నాయి. దీని ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. ప‌వ‌న్ చేసిన త్యాగాల‌ను.. ప్ర‌స్తావిస్తున్నారు. ఎందుకు త‌మ‌తో క‌ల‌వాల్సి వ‌చ్చిందో వివ‌రిస్తున్నారు. ఇది ఒక పార్ట్‌.

ఇక‌, రెండో విష‌యానికి వ‌స్తే..చంద్ర‌బాబు వంటి నాయ‌కుడు.. ఎవ‌రినీ పొగ‌డ‌ర‌నే సందేహాలు అంద‌రికీ ఉన్నాయి. ఎంత సేపూ త‌న గురించి మాత్ర‌మే చెప్పుకొంటార‌ని ఆ పార్టీ నాయ‌కులు కూడా అంటుంటారు . దీంతో ప‌వ‌న్ అభిమానులు చంద్ర‌బాబు నోటి నుంచి త‌మ నాయ‌కుడిని పొగిడే క్ష‌ణాల కోసం ఎదురు చూస్తున్నారు. త‌ద్వారా.. పొత్తులు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని చంద్ర‌బాబు కూడా గ్ర‌హించారు. దీంతో ఆయ‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చంద్ర‌బాబు , ప‌వ‌న్‌లు వేర్వేరు కార‌ని.. ఇద్ద‌రు ఒకటే అనే సంకేతాలు పంపించ‌డం ద్వారా.. పొత్తుల్లోకార్య‌క‌ర్త‌లు క‌లిసి ప‌నిచేసేలా వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదీ.. సంగ‌తి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: