ఒంగోలులో " TDP DJ " తో బాలినేని వాసుకు ఈ సారి ద‌బిడి దిబిడేనా..?

RAMAKRISHNA S.S.
- జ‌గ‌న్ బంధువైనా పార్టీలో త‌గ్గిన వాసు ప్రాధాన్యం
- ఐదేళ్ల‌లో పెరిగిన భూక‌బ్జాల‌తో మ‌స‌క‌బారిన బాలినేని ప్ర‌భ‌
- జ‌న‌సేన స‌పోర్ట్‌తో జ‌నార్థ‌న్ గెలుపుపై పెరిగిన ధీమా
- ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో అభివృద్ధిపై ఒంగోలులో చ‌ర్చ‌
( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. గెలుపెవరిది అంటే... స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం... పోటీ పడుతుంది పాతవారే... కానీ ఇద్దరూ ఇద్దరే అంటున్నారు ఒంగోలు వాసులు. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే దామాచర్ల జనార్థన్, వైసీపీ తరఫున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి. జిల్లా రాజకీయాల్లో ఇద్దరిదీ సుదీర్ఘ చరిత్ర. ఇద్దరికీ ఒంగోలు బలమైన నేపథ్యం. ఇద్దరు నేతలు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇద్దరికీ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్థికంగా కూడా ఇద్దరూ ఇద్దరే.

ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్నారు బాలినేని వాసు. జగన్ బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న బాలినేని... మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. చివరికి జగన్ తీరుపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలుు చేశారు. అలాగే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పట్టుబట్టారు కూడా. వాసు పని చేస్తాడు అని ఎంత పేరుందో... అవినీతి పరుడనే పేరు కూడా అంతే ఉంది. ఒంగోలులో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని... వాటి వెనుక బాలినేని హస్తం ఉందనే పుకార్లున్నాయి.

ఇక చెన్నై దగ్గర అక్రమంగా పట్టుబడిన సొమ్ము బాలినేని అనుచరుడిదే అనేది బహిరంగ రహస్యం. ఇక బాలినేని అంటే పేకాట అనే మాట అందరికీ తెలిసిందే. మంత్రిగా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదంటున్నారు స్థానికులు. అధికారుల బదిలీల కోసం పట్టుబట్టిన బాలినేని... ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట కూడా మాట్లాడలేదు. ఇక బాలినేని హాయాంలోనే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావుపై దాడి చేశారు వైసీపీ నేతలు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. చివరికి వైశ్య సామాజిక వర్గం బాలినేని తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది కూడా.

మరోవైపు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దామచర్ల జనార్థన్‌కు సామాజిక పరంగా అండ ఉంది. అదే సమయంలో టీడీపీతో జనసేన పొత్తు కారణంగా... ఒంగోలులోని గద్దలగుంట ప్రాంతానికి చెందిన కాపు నేతలు జనార్థన్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో 15 వేల‌కు పైగా ఉన్న కాపు ఓట‌ర్ల‌తో పాటు జ‌న‌సేన‌, ప‌వ‌న్ అభిమానులు జ‌నార్థ‌న్‌కు బాగా స‌పోర్ట్ చేస్తున్నారు.

ఇది జనార్థన్‌కు కలిసి వచ్చే అంశం. అయితే కేవలం కొద్దిమంది నేతలను మాత్రమే జనార్థన్ దగ్గరకు తీస్తారనే మాట ఉంది. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఒంగోలును మ‌రో 150 ఏళ్ల పాటు వెన‌క్కు తిరిగి చూసుకునే ప‌ని లేకుండా అభివృద్ధి చేశార‌నే పేరుంది. ఆయ‌న వివాదాల‌కు దూరంగా ఉంటారు. వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడు అని కూడా అంటారు. ఇక ఒంగోలులో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ... ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్‌కు అనుకూలంగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: