బాప‌ట్లలో ' వైసీపీ కోన‌ ' ను ముంచేస్తోన్న అవినీతి మ‌కిలీ..?

RAMAKRISHNA S.S.
బాప‌ట్ల ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు కోన ర‌ఘుప‌తిపై ఇప్ప‌టి వ‌ర‌కు అవినీతి ఆరోప‌ణ‌లు వినిపించ‌లేదు. పైగా.. వ‌రుస విజ‌యాలు కూడా అందుకున్నారు. దీంతో కోన వంటి నాయ‌కుడు అవినీతి చేశారంటే ఎవ రూ న‌మ్మ‌రు. పైగా.. వాస్త‌వానికి ఆయ‌న‌ది సంప‌న్న కుటుంబం. కోన తండ్రి.. గ‌తంలోనే గ‌వ‌ర్న‌ర్ వంటి బ‌ల‌మైన ఉన్నత స్థాయి పోస్టులు చేశారు. కాబ‌ట్టి వారికి డ‌బ్బుకు కొద‌వ‌లేదు. హుందాగా కూడా ఉంటారు.  అయితే.. ఇలాంటి నాయ‌కుడికి ఇప్పుడు అవినీతి బెడ‌ద ప‌ట్టుకుంది.


ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా కోన చుట్టూ ఇప్పుడు అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇవి ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లు కావు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచే వినిపిస్తున్న ఆరోప‌ణ‌లు. దీంతో కోన ప్ర‌చారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం బాప‌ట్ల‌లో పోరు తీవ్రంగా ఉంటుంద‌నే అంచ‌నా లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఈ సారి ఇక్క‌డ మార్పు త‌ప్ప‌ద‌ని కూడా అంటున్నారు. వ‌రుస విజ‌యాలు ఇచ్చిన బాప‌ట్ల ప్ర‌జ‌లు.. ఈ సారి మార్పు కోరుకుంటున్నార‌ని ప‌లు స‌ర్వేలు కూడా చెబుతున్నాయి.


అయితే.. చిత్రంగా ఇప్పుడు కోన‌కు అవినీతి సెగ త‌గులుతోంది. కోన పేరు చెప్పి నియోజ‌క‌వ‌ర్గంలో  కీల‌క‌మైన నాయ‌కులుగా ఉన్న కొంద‌రు వ్య‌క్తులు అడుగ‌డుగునా అవినీతికి పాల్ప‌డిన‌ట్టు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇసుక నుంచి మ‌ట్టి వ‌ర‌కు కూడా విక్ర‌యాలు చేశార‌ని.. స్థానికంగా అంద‌కుండా చేశార‌నేది లోక‌ల్ టాక్‌. పైగా.. స‌మ‌స్య‌లు అండిగేందుకు కూడా.. ఎమ్మెల్యే అందుబాటులో లేర‌నే వాద‌న గ్రామీణ స్థాయిలో వినిపిస్తోంది.


మ‌రోవైపు త‌న అనుచ‌ర‌గ‌ణం చేస్తోన్న అవినీతి త‌న‌కు తెలిసి కూడా దానిని నిలువ‌రించలేక పోవ‌డం కూడా.. కోన‌కు ఇబ్బందిగా మారింది. వ‌లంటీర్ల పోస్టుల‌ను కూడా అమ్ముకున్నారంటూ బాప‌ట్ల మండ‌ల ప‌రిధిలో నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది కోన ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ‌తీస్తున్న ప‌రిణామం. అదేస‌మ‌యంలో స‌మ‌న్వ‌యం లేని ఆయ‌న పాల‌న కూడా ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ప్ర‌జల వ‌ద్ద‌కు వెళ్తున్న కోన‌కు ఇవ‌న్నీ స్వాగ‌తం ప‌లుకుతుండ‌డంతో ఆయ‌న గెలుపుపైనే ప్ర‌భావం పడింద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: