తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగింది. తుక్కుగూడ జనజాతర మహాసభ వేదికగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవరును పోలీసులు కొట్టినట్టు సమాచారం అందుతోంది. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభలో భట్టి విక్రమార్క కాన్వాయిని అనుమతించకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా, సభలోకి వెళ్లడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్ పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నట్టు సమాచారం. అలాగే జేబులో ఉన్న ఐడి కార్డును సీపీ గుంజుకున్నారట. సభా ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు. సమస్య సద్దుమనిగిన అరగంట తర్వాత తిరిగి డ్రైవర్ ను పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో సీపీ కొట్టించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ ఫోన్లను గుంజుకొని వీడియో తీసిన వ్యక్తి పై కూడా పోలీసులు చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం చెక్కర్లు కొడుతుండడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే గౌరవం లేదా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం యాదాద్రిలో సైతం భట్టికి అవమానం జరిగిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి ఆలయంలో కుర్చీలపై కూర్చుంటే భట్టి విక్రమార్క కింద కూర్చున్నారు. దీంతో పెద్ద వివాదమే చోటు చేసుకుంది, బహుజనుడు కావడంతోనే భట్టిని అవమానించారు అంటూ పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మరోసారి భట్టి కాన్వాయిని పోలీసులు ఆపడంతో భట్టి అభిమానులు ఈ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని పెద్దల సపోర్ట్ తోనే పోలీసు అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: