ఆదిలాబాద్ పోరు: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్ తప్పదా..?

RAMAKRISHNA S.S.
- మూడు పార్టీల‌కు తోడుగా లాంబాడాల నుంచి నాలుగో క్యాండెట్‌
- ఓట్ల చీలిక ప్ర‌ధాన పార్టీల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో ?
- ఆదివాసీలే టార్గెట్‌గా లంబాడాల రాజ‌కీయ వ్యూహం
( ఉత్తర తెలంగాణ ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ )
ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు విషయంలో అనుకోని మలుపులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేయగా.. నాలుగో అభ్యర్థిగా లంబాడా నేతలు తమ వర్గం నుంచి ఓ నేతను బరిలోకి దింపనున్నట్లు  సమాచారం. ఇది ఇప్పుడు మూడు పార్టీలకు సవాల్ గా మారే అవకాశముంది. ఎన్నికలకు చాలా రోజుల ముందే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది.
గతంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. ఇక కాంగ్రెస్ ఆత్రం సుగుణను బరిలోకి దింపింది. మరోవైపు బీజేపీ గోడం నాగేష్ కు టికెట్ కేటాయించింది. వీరు ముగ్గురు కూడా గోండు సామాజిక వర్గానికి చెందినవారే.
ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ, లంబాడాలకు పెట్టింది పేరు. ఇటీవల ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు లోక్ సభ అభ్యర్థులుగా ఆదివాసీ నేతలను ఎంపిక చేశాయి కానీ మూడు పార్టీలు ఏ ఒక్క స్థానంలో లంబాడాలకి సీటు కేటాయించాయించలేదు. దీంతో ఆగ్రహం చెందిన లంబాడాలు మూడు పార్టీలకు సవాల్ విసరనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నుంచి ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఎంపీ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో టికెట్ ఆశించి భంగపడ్డ వారిద్దరినీ లంబాడా సామాజిక వర్గం నుంచి పోటీలో దింపనున్నట్లు తెలుస్తుంది. ఓటరు జాబితా ప్రకారం 2 లక్షలకుపైగా ఆదివాసీ ఓటర్లు, లక్ష 48 వేల లంబాడా ఓటర్లు ఉన్నట్లు లంబాడా జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల అభ్యర్థుల్లో ఆదివాసీ ఓట్లు డివైడ్ అవుతాయని.. అప్పుడు తమ వర్గ అభ్యర్థికి వన్ సైడ్‌గా ఓట్లు పడి గెలిచే అవకాశం ఉంటుందని లంబాడా నేతలు భావిస్తున్నారు. ఆదివాసీ, లంబడాల మధ్య కొన్నేళ్లుగా రిజర్వేషన్లకు సంబంధించిన  వైరం ఏర్పడింది. ఇప్పుడు అది రాజకీయంలో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: