పిఠాపురంపై `ముద్ర`గ‌డ లెక్కెంత‌.. మూడో స్థానంలో నిలిచినోడికి ప‌వ‌న్‌ను ఓడించే సీన్ ఉందా..?

RAMAKRISHNA S.S.
- 2009 ఎన్నిక‌ల్లో వంగాగీత చేతిలో ఓడి మూడోస్థానంలో ముద్ర‌గ‌డ‌
- కాపు ఉద్య‌మం పేరుతో హ‌డావిడి గ‌ప్‌చుప్‌
- కాపుల్లోనే ఆద‌ర‌ణ కోల్పోయిన కురువృద్ధుడు


( గోదావ‌రి జిల్లాల ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురం. తూ ర్పుగోదావ‌రి జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తుండ‌డ‌మే దీనికి కార‌ణం. ఇక‌, ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుత కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. అయితే.. రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్షాల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న వైసీపీ.. ముఖ్యంగా ప‌వ‌న్ వంటి బ‌ల‌మైన గ‌ళాన్ని అసెంబ్లీకి అడుగు పెట్ట‌కుండా చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అంతే రేంజ్‌లో రాజ‌కీయాల‌కు తెర‌దీసింది.


ఈ క్ర‌మంలోనే.. పిఠాపురంలో కీల‌క నాయ‌కుల‌ను రంగంలోకి దింపి.. గీత విజ‌యం కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల్లో.. న‌లుగురు కీల‌క నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి న వైసీపీ.. గీత‌ను గెలిపించే లక్ష్యాన్ని వారి చేతుల్లోనే పెట్టింది. వీరిలో మాజీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఒక‌రు.వాస్త‌వానికి ఇత‌ర ముగ్గురు నాయ‌కుల కంటే కూడా.. ప‌ద్మ‌నాభంపైనే వైసీపీ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకుంది. ఈయ‌న లోక‌ల్ కావ‌డం.. గ‌తంలో ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డంతో వైసీపీ పూర్తి బాధ్య‌త‌లు ఆయ‌న‌కే దాదాపు అప్ప‌గించింది.

పైగా కాపు నాయ‌కుడు.. గ‌తంలో కాపు ఉద్య‌మాన్ని.. ముందుండి న‌డిపిన నాయ‌కుడు కూడా కావ‌డంతో ముద్ర‌గ‌డ‌పై ఆశ‌లు భారీగానే ఉన్నాయి. అయితే.. ఈయ‌న శ‌క్తి ఎంత‌?  అప్ప‌టికి ..ఇప్ప‌టికీ ఈయ‌న‌లో వ‌చ్చిన మార్పులు ఏంటి?  ఇవి గీత‌ను ఎంత వ‌ర‌కు విజ‌య‌తీరాల‌కు చేరుస్తాయ‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ముఖ్యంగా కాపు ఉద్య‌మంతో ఒక ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా చెల‌రేగిపోయిన ప‌ద్మ‌నాభం పేరు.. త‌ర్వాత కాలంలో నేల‌కు జారిపోయింది. ఆయ‌న ఏమీ సాధించ‌లేక పోయార‌నే వాద‌న వినిపించింది.

దీంతో కాపుల్లో ముద్ర‌గ‌డ‌కు గ‌తంల ఉన్నంత పేరు ఇప్పుడు లేదు. ఇది గీత‌ను గెలిపించేస్థాయిలో ఏమాత్రం ప‌నికిరాద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్ర‌గ‌డ‌.. ఇదే గీత‌పై.. ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఏకంగా మూడో స్థానానికి ప‌డిపోయారు. అంటే.. అప్ప‌ట్లోనే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, ఇప్పుడు యాక్టివ్‌గా ఉండి ప్ర‌జాక్ష‌త్రంలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉందా? అంటే.. ఇది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. ఎందుకంటే.. వ‌య‌సు రీత్యా ముద్ర‌గ‌డ‌కు ఈ అవ‌కాశం లేకుండా పోయింది.

ఆయ‌న మీడియా మీటింగుల్లోనే ఆవేశ‌ప‌డిపోతున్నారు. రొప్పుతున్నారు. బీపీ కూడా పెరిగిపోతోంది. దీంతో ప్ర‌త్య‌క్ష ప్ర‌చారంలో ఆయ‌న దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పాల్గొన్నా.. ఆయ‌న ప్ర‌సంగాలు.. ప్ర‌జ‌ల‌కు న‌చ్చుతాయ‌నే విష‌యంపైనా సందేహాలు ఉన్నాయి. వైసీపీతో అంట‌కాగుతున్నార‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో గీత‌ను గెలిపించ‌డం.. కాపుల‌ను ఐక్యం చేయ‌డం వంటివి ముద్ర‌గడ‌కు సాద్యం కాద‌ని తేల్చేస్తున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: