మా దాస‌రోడి క‌న్నా నిజ‌మైన‌ బెస్ట్ కాపు లీడ‌ర్ ఉంటాడా..?

RAMAKRISHNA S.S.
ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు అంటే.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అనేక రంగాల్లో ఆయ‌న అప్ర‌తిహ‌త విజ‌యం అందుకున్నారు. సినీ రంగంలోనే కాకుండా.. సామాజిక‌, రాజ‌కీయ రంగాల్లో నూ దాస‌రిది అందెవేసిన చేయి. కాపు నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌స్థానంలో అనేక మైలు రాళ్లు ఉన్నాయి. ఓట‌మి ఎరుగ‌ని దాస‌రి.. సినిమా ఇండ‌స్ట్రీకి దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా పెద్ద‌న్న‌గా చ‌క్రం తిప్పారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌.. కేంద్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.
అయితే.. దాస‌రి విజ‌యాల‌కు కార‌ణం.. ఒకే ఒక్క ప‌ట్టుద‌ల‌. తెలుగువారిని చైత‌న్యం చేయ‌డం.. ముఖ్యం గా కాపు సామాజిక వ‌ర్గంలో నెల‌కొన్న అసంతృప్తి, రాజ్యాధికారం వంటి వాటిని సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న అడుగులు వేశారు. అయితే..ఆయ‌న వేసిన ప్ర‌తి అడుగూ విజ‌య‌వంత‌మైంది. ఆయ‌న ఏ రంగంలోకి వ‌చ్చినా.. విజ‌య‌మే వ‌రించింది. దీంతో దాస‌రి అంటే.. ఒక ఐకానిక్ లీడ‌ర్‌.. మేధావి.. పెద్ద‌.. గురువు.. ఇలా.. అనేక కోణాల్లో దాస‌రి నిలుస్తారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించేలా అభిమానించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.
సినిమా రంగం..
చిన్న‌పాటి స్క్రిప్టు రైట‌ర్‌గా సినీరంగంలోకి అడుగులు వేసిన దాస‌రి నారాయ‌ణ‌రావు.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కే స్థాయిని (అత్య‌ధిక సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి) అందుకోవ‌డం గ‌మ‌నార్హం.తాతా మ‌న‌వ‌డు వంటి కుటుంబ క‌థా చిత్రాల‌తో ప్రారంభ‌మైన దాస‌రి ప్ర‌స్థానం.. త‌ర్వాత అనేక మ‌లుపులు తిరిగింది. రాజ‌కీయంగా ఆయ‌న అధికార ప‌క్షం దుర్నీతి, ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పైనా ఆయ‌న పోరాట యుతంగా అనేక సినిమాలు చేశారు. రాజ‌కీయాల‌ను మేళ‌వించి.. ప‌దునైన మాట‌ల‌తో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఎలుగెత్తారు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన‌వే.. పిచ్చోడి చేతిలో రాయి, విశ్వ‌నాథ‌నాయ‌కుడు వంటివి.
మీడియా రంగంలో సంచ‌ల‌నాల ఉద‌యం..
దాస‌రి నారాయ‌ణ‌రావు.. కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాలేదు. 1980ల‌లో ఒక కులానికి కొమ్ము కాస్తున్న మీడియాపై ఆయ‌న యుద్ధం ప్ర‌క‌టించారు. ఎంత సేపూ ఒక సామాజిక వ‌ర్గం వారే దీనిలో ఆధిపత్య ధోర‌ణితో ముందుకు సాగుతున్నార‌నే వాద‌న‌ను ఆయ‌న ఖండిస్తూ.. త‌నే రంగంలోకి దిగి 1982-83 మ‌ధ్య కాలంలో అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని `ఉద‌యం` తెలుగు దిన‌ప‌త్రిక‌ను స్థాపించారు. దీనిద్వారా సామాన్యులు, సాధార‌ణ ప్ర‌జ‌లు, అన్ని సామాజిక వ‌ర్గాల గ‌ళాన్ని వినిపించ‌డం ప్రారంభించారు. దీంతో అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే ఇది 2 ల‌క్ష‌ల పైచిలుకు.. స‌ర్య్కులేష‌న్‌కు వెళ్లింది. ఉదయం.. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై  క‌డిగి పారేసింది.
ఉద‌యం అనే పేప‌ర్ లేక‌పోతే కారంచేడు, చుండూరు ద‌ళితుల ఊచ‌కోత అనేవి ఈ బాహ్య ప్ర‌పంచానికి ఇలా తెలిసేవే కాదు. ఉద‌యం అప్ప‌టి పాల‌కుల దుర్నీతిని ఎండ‌గ‌ట్టింది. ముఖ్యంగా 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టుల`కు పెద్ద‌పీట వేసి పాఠ‌కుల మ‌న‌సు దోచింది. అన్ని వ‌ర్గాలకు స‌మ‌ప్రాధాన్యం ఇస్తూ.. అన‌తి కాలంలోనే ఉద‌యం పేరు తెచ్చుకుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు ఉద‌యం నిలువెత్తు అవ‌కాశం క‌ల్పించింది. టాబ్లాయిడ్ అనే ప్ర‌త్యేక సంచిక‌లు తీసుకువ‌చ్చి.. రాష్ట్రంలో ఏ మూల ఏం జ‌రిగినా.. ప్ర‌జ‌ల‌కు నివేదించింది. ఇలా.. ఉద‌యం ప్ర‌త్యేక‌స్థానం సంపాయించుకుంది. ఇది పూర్తిగా దాస‌రి ఆలోచ‌న నుంచే ఉద్భ‌వించిన ప‌త్రిక‌.
రాజ‌కీయం..
సినిమాల్లో బిజీగా ఉన్న స‌మ‌యంలోనే దాస‌రి నారాయ‌ణ‌రావు.. త‌ర్వాత కాలంలో ఇందిరాగాంధీ విధానాల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఇందిర‌మ్మ ఇచ్చిన గ‌రీబీ హ‌ఠావో నినాదానికి దాస‌రి మంత్రముగ్ధుల‌య్యారు. పేద‌ల‌కు భూముల పంపిణీని స్వాగ‌తించారు. దీనిని త‌న సినిమాల్లోనూ చొప్పించారు. ఇక‌, పేద‌ల‌కు ఆహార పంపిణీ.. వారికి కూడు-గూడు-గుడ్డ అందించిన ఇందిర‌మ్మ త‌ర్వాత‌.. కాలంలో కాంగ్రెస్ వైపు ఆయ‌న‌ను మొగ్గు చూపేలా చేశారు. ఇక‌, రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి దాస‌రికి మ‌ధ్య అద్భుత‌మైన కెమిస్ట్రీ కుదిరింది. వైఎస్‌-దాస‌రి పాలుతేనెలా క‌లిసిపోయారు. ఇదే ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించింది. త‌ర్వాత కాలంలో కేంద్రంలో మంత్రిగాను అవ‌కాశం క‌ల్పించింది. ఇలా.. రాజీకీయాల్లోనూ దాస‌రి త‌న‌దైన ముద్ర వేశారు.
కాపు ఉద్యమ నాయ‌కుడిగా..
ఇది దాస‌రిలోని అస‌లు సిస‌లు కోణం. స‌మాజంలో అన్ని వ‌ర్గాలు బాగుండాల‌నే ధ్యేయం దాస‌రిలో ఉంది. అయితే..అదేస‌మ‌యంలో తాను పుట్టిన కాపు సామాజిక‌వ‌ర్గం కోసం ఏదైనా చేయాల‌న్న త‌ప‌న ఆయ‌న‌లో బ‌లంగా ఉంది. కాపుల రిజ‌ర్వేష‌న్ మాత్ర‌మే కాదు.. కాపుల‌కు ప్ర‌త్యేకంగా కొన్ని ప‌థ‌కాలు.. వారి పిల్ల‌ల‌కు విద్య‌, ఉపాధివంటివి ఉండాల‌ని త‌పించారు దాస‌రి. ఇదే విష‌యంపై.. అనేక సంద‌ర్భాల్లో అప్ప‌టి సీఎం వైఎస్‌తోనూ ఆయ‌న చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో కాపుల‌కు మంత్రిప‌ద‌వులు కూడా ద‌క్కాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌కాపు ఉద్య‌మానికి కూడా దాస‌రి.. రూప‌కల్ప‌న చేశారు.
అయితే.. కొన్ని కార‌ణాల‌తో ఆయ‌న ఈ ఉద్య‌మానికి దూరంగా ఉండిపోయినా ఆయ‌న చొర‌వ వ‌ల్లే కాపుల‌కు రాజ‌కీయంగా మంచి ప‌ద‌వులు ద‌క్కాయి. కాపు కోసం ఏదైనా చేయాల‌న్న త‌ప‌న‌తోనే ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపు యువ‌త  కోసం ప‌లు వృత్తుల్లో శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. త‌ర్వాత ఇది లేకుండా పోయాయి. ఇలా.. దాస‌రి.. స్పృశించ‌ని రంగం లేదు.. ఆయ‌న చేయి పెట్ట‌ని అంశం లేదు. ఏం చేసినా.. అది ప‌దిమందికీ ఉప‌యోగ‌ప‌డాల‌ని.. ప‌దిమందికీ ప్ర‌యోజ‌నం క‌లిగించాల‌ని త‌పించేవారు దాస‌రి!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: