తండ్రి నుంచి కొడుకు వ‌ర‌కు.. వైఎస్ ఫ్యామిలీతో త‌ర‌త‌రాలుగా చెద‌ర‌ని ' జ‌క్కంపూడి ' అనుబంధం..!

RAMAKRISHNA S.S.
తూర్పు గోదావ‌రి జిల్లాలోనే కాదు.. తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌క్కంపూడి ఫ్యామిలీ అంటే.. ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఫ్యామిలీకి ప‌రిచ‌యం కూడా అవ‌స‌రం లేదు. దివంగ‌త మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న‌రావు నుంచి ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజావ‌ర‌కు అంద‌రూ ప్ర‌జ‌ల సేవ‌లో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటే.. జ‌క్కంపూడి కుటుంబానికి ప్ర‌త్యేక అభిమాన‌మ‌ని వేరేగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తండ్రి నుంచి కుమారుడి వ‌ర‌కు కూడా ఈ కుటుంబం వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటోంది.
గ‌తంలో వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. జ‌క్కంపూడి రామ్మోహ‌న‌రావుకు.. మంత్రిప‌ద‌వి ఇచ్చారు. చిత్రం ఏంటంటే.. తూర్పుగోదావ‌రి  జిల్లాకు చెందిన అప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కుల‌కు కేంద్రంలోని అధిష్టానంతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉండేది. దీంతోవారు అక్క‌డ నుంచి సిఫార‌సులు చేయించుకుని ప‌ద‌వులు పొందేవారు. ఇలా.. వైఎస్ కేబినెట్‌లో ఒక‌రిద్ద‌రు మంత్రి ప‌ద‌వులు తెచ్చుకున్న‌వారు కూడా ఉన్నారు. అయితే.. జ‌క్కంపూడి కుటుంబానికి వైఎస్ పెద్ద సిఫార‌సు.
ఆయ‌నే స్వ‌యంగా ఉండి.. జ‌క్కంపూడిని త‌న కేబినెట్‌లోకి తీసుకున్నారు. అంతేకాదు. ఆయ‌న అనారో గ్యంతో ఉంటే.. వేరే వారిని మార్చాల‌న్న ఒత్తిడి వ‌చ్చినా.. వైఎస్ ఆయ‌న‌నే కొన‌సాగించారు. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌క్కంపూడికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా త‌న కేబినెట్లో త‌న ప‌క్క‌నే కూర్చోపెట్టుకునే వారు. ఇక‌, ఎప్పుడు రాజ‌మండ్రి వ‌చ్చినా (వైఎస్ హ‌యాంలో 6 సార్లు రాజ‌మండ్రికి వ‌చ్చారు) జ‌క్కంపూడి కుటుంబాన్ని పల‌క‌రించ‌కుండా వెళ్లేవారు కాదు. ఇలాంటి అనుబంధం ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఉంది. రామ్మోహ‌న్ రావు త‌ర్వాత ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మికి కూడా సీటు ఇచ్చి ప్రోత్స‌హించింది కూడా వైఎస్సే.
ఇక‌, రామ్మోహ‌న‌రావు త‌ర్వాత ఆయ‌న కుమారుడు రాజా కూడా వైఎస్ కుటుంబంతో అదే అనుబంధం పెంచుకున్నారు. తండ్రులు వైఎస్సార్‌, రామ్మోహ‌న్‌రావు అనుబంధం ఎంత గొప్ప‌గా ఉండేదో ఇప్పుడు వారి త‌న‌యుడు జ‌గ‌న్‌, రాజా, గ‌ణేష్ మ‌ధ్య కూడా అంతే గొప్ప అనుబంధం కంటిన్యూ అవుతోంది.
ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్‌కు అత్యంత కావాల్సిన వ్య‌క్తిగా రాజా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం వ‌చ్చీ రాగానే.. జ‌గ‌న్ ఆయ‌న‌కు కాపు కార్పొరేష‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు. ఈ ప‌ద‌వితో రాజా.. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వికి వ‌న్నె తేవ‌డంతో పాటు పార్టీ ప్ర‌భుత్వానికి కూడా పేరు తెచ్చారు.
దీంతో సీఎం జ‌గ‌న్‌కు మ‌రింతగా రాజా చేరువ‌య్యారు. ప్ర‌స్తుతం రాజాన‌గ‌రం నుంచి రాజా రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక‌, తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా కూడా రాజా పార్టీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను గెల‌వ‌డంతోపాటు.. మ‌రిన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీని గెలిపించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ సారి జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రాజాకు మ‌రింత ప్ర‌యార్టీతో కూడిన ప‌ద‌వి ఉంటుంద‌నేది కూడా పార్టీ వ‌ర్గాల్లో త‌ర‌చూ వినిపించే మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: