లావు శ్రీకృష్ణ‌ Vs అనిల్ కుమార్‌.. న‌ర‌సారావుపేట‌లో విక్ట‌రీ కొట్టే హీరో ఎవ‌రంటే..?

RAMAKRISHNA S.S.
పల్నాడులో విస్తరించి ఉన్న నరసరావుపేట లోక్‌స‌భ సెగ్మెంట్‌లో ఈసారి ఆసక్తికర పోరు జరుగుతుంది. మొన్నటి వరకు వైసీపీ లోనే కలిసి పనిచేసిన ఇద్దరు నేతలు.. ఇప్పుడు వేరువేరు పార్టీల నుంచి శత్రువులుగా పోటీపడుతున్నారు. మొన్నటి వరకు నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులు ఆ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకుని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే.. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన‌ అనిల్ కుమార్ మూడు జిల్లాలు దాటి వచ్చి నరసారావుపేటలో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు.
 
పార్లమెంటు పరిధిలో రెండు పార్టీల బలాబలాలు ఇతర ఈక్వేషన్లు పరిశీలిస్తే హోరాహోరీ పోరు జరుగుతున్నా.. ప్రస్తుతానికి లావుకు స్వల్ప ఆధిక్య‌త‌ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్లపాటు ఎంపీగా ఉన్న లావు వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. అవినీతికి దూరంగా ఉండటం.. ప్రజాసేవలో ముందు ఉండటం ఎవరిని అయినా కలుపుకుపోయే మనస్తత్వం ఇవన్నీ లావును నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే కాకుండా.. గుంటూరు జిల్లా వ్యాప్తంగాను, అటు రాష్ట్ర వ్యాప్తంగాను ఎంతోమందికి దగ్గర చేశాయి.

ఈరోజు ప్రతి కులంలోను.. యువతలోనూ లావును అభిమానించే వారి సంఖ్య లక్షల్లో ఉంది అంటే.. ఆయన వ్యక్తిత్వానికి అది నిదర్శనం. ఇటు విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్గా ఆయన ఎంతోమంది యువతకు బాగా కనెక్ట్ అయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ మంత్రిగా దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో రెండు లక్షలకు పైగా యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారని జగన్ అత‌ని ఇక్కడ పోటీకి పెట్టారు. అయితే అదే సమయంలో కమ్మ వర్గం ఓటర్లు కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నారు.

జగన్ బీసీ ఈక్వేషన్‌తో ఇక్కడ అనిల్ ను పోటీకి పెట్టినా.. మెజార్టీ యాదవ వర్గం ఇప్పటికీ టీడీపీ తోనే ఉంది. బీసీలలో మెజార్టీ ప్రజలు ఓటర్లు ఇప్పటికీ సాంప్రదాయంగా టీడీపీ తోనే ఉన్నారు. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్ల ఈక్వేషన్ తో ఈ సీటును గెలుచుకోవాలని జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. లావుకు కులాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇమేజ్ ఉండటం.. కమ్మ, బీసీ, కాపు, బలిజ, వైశ్య కులాలతో పాటు రెడ్డి వర్గంలోనూ కొందరు ఆయనకు అనుకూలంగా ఉన్న పరిస్థితి.

ఇక పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ గెలుపుపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. ఒక్క నరసరావుపేటలో వైసీపీకి మొగ్గు కనిపిస్తుండగా.. గత 20 ఏళ్లలో తెలుగుదేశం గెలవని మాచర్లలో ఈసారి సైకిల్ పార్టీకి సానుకూలత కనిపిస్తోంది. గురజాలలో గట్టి పోటీ ఉన్న య‌రపతినేని బయటపడతారని అంచనాలు ఉన్నాయి. ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య గట్టి పోటీ ఉన్నా.. కన్నా రాజకీయ చాతుర్యం ముందు అంబటి తట్టుకోలేరని ఇక్కడ కూడా కూటమికే ముగ్గు ఉంటుందని అంటున్నారు.

ఓవరాల్‌గా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇటు లావుకు వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ కూడా తోడు కానుంది. ఇంత గట్టి పద్మవ్యూహం చేధించి ఇక్కడ అనిల్ కుమార్ గెలిస్తే రికార్డే అవుతుంది. మరి నరసరావుపేట పార్లమెంటు ఓటరు ఎవరిని ఎంపీగా చేసి పార్లమెంటుకు పంపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: