అలీ రాజకీయ జీవితం బలి..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవటంతోప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నాయి..రానున్న ఎన్నికలలో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ “మేమంతా సిద్ధం” పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు.ఇది పూర్తయ్యాక హెలికాప్టర్‌ లో రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి మరోసారి నిరాశ ఎదురయ్యింది. వైసీపీ అభ్యర్థుల జాబితాలో ఎక్కడా అలీకి సీటు దక్కలేదు. అలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దించుతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఈ మేరకు అలీకి జగన్‌ సీటు ఖరారు చేశారని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించడమే ఆలస్యమని పలు రకాల వార్తలు వచ్చాయి. కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవాలని అలీకి జగన్‌ ఆఫర్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.

జగన్ ఇచ్చిన ఆఫర్ లో అలీ నంద్యాలను ఎంచుకున్నారని ప్రచారం జరిగింది.. తీరా చూస్తే అలీకి ఎక్కడా పోటీ చేసే చాన్స్‌ అయితే దక్కలేదు.కాగా గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా జోరుగా చేశారు. ఈ నేపథ్యంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్‌ ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నుంచి అయినా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం రాలేదు. 

గత ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. మూడున్నరేళ్లు ఏ పదవి లేకుండా ఆయన ఖాళీగానే ఉండిపోయారు. 
ఇక 2021 చివరి లో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీని నియమించారు. దీనితో చేసేదేమి లేక అలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు.కాగా అలీ ఇటీవల వైసీపీ తరఫున సామాజిక సాధికార బస్సు యాత్రల్లో పాల్గొని ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు కూడా అలీ చెప్పారు. అయినప్పటికీ అలీకి సీటు మాత్రం దక్కలేదు. దీనితో అలీ కూడా వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎక్కడా కూడా ప్రచారంలో కనిపించడం లేదు.దీనితో అలీ రాజకీయ జీవితం బలైనట్లుగా చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: