గుంటూరు వెస్ట్ నుంచి ర‌జ‌నీ అవుట్‌... స‌జ్జ‌ల‌కు మొర పెట్టుకుందెవ‌రు..?

RAMAKRISHNA S.S.
ఏపీలో అధికార వైసీపీలో పలు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు యూటర్న్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వైసీపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు విశ్వసినీయ‌ వర్గాల‌ ద్వారా తెలిసింది. రాజధాని అమరావతి ప్రాంతం కావడంతో గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు కాస్త టెన్షన్ తోను.. కాస్త భయంతోనో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు లోక్‌స‌భ స్థానం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కొద్ది రోజుల క్రితం పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరామయ్య రంగ ప్రవేశం చేశారు.

అంతకుముందు సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన‌యుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ఖరారు చేశారు. ఆయన మధ్యలోనే చేతులు ఎత్తేయడంతో కిలారు రోశయ్యకు జగన్ గుంటూరు పార్లమెంటు సీటు కట్టబెట్టారు. అయితే ఇంకా నామినేషన్ల‌ పర్వం కూడా ప్రారంభం కాకుండానే.. రోశయ్య కాడి కింద పడేసినట్టు తెలుస్తోంది. రోశయ్యకు పొన్నూరు వ‌దిలి గుంటూరు పార్లమెంటుకు రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే జగన్ సూచించడంతో బలవంతంగా ఇక్కడికి వచ్చారు. అధిష్టానం సూచించిన డబ్బులు కూడా రోశయ్య వద్ద లేవని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో రోశయ్య తన మామగారు ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు.. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి తో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జ‌ల‌ రామకృష్ణారెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది. తాను గుంటూరు ఎంపీగా పోటీ చేయలేనని.. అంత ఆర్థిక స్థితి తనకు లేదని.. రోశయ్య సజ్జలకు విన్నవించినట్లు తెలిసింది. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు సీటు.. తనకు ఇవ్వాలని అది.. వీలుకాని పక్షంలో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

గుంటూరు.. పశ్చిమలో తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారని కూడా రోశయ్య.. సజ్జలకు వివరించారట. ఇక చిలకలూరిపేట నుంచి ఇక్కడికి వచ్చిన మంత్రి విడుదల రజినీని గుంటూరు ఎంపీగా బరిలో దించాలని కూడా రోశయ్య సూచించినట్లు సమాచారం. అయితే ఈ టైంలో మార్పులు చేయటం అంత సులువు కాదని.. ఇప్పుడే తొందరపడి ఇలాంటి ప్రకటనలు చేయవద్దని.. ఏ విషయమై తాను సీఎం జగన్‌తో మాట్లాడి చెబుతానని సజ్జల రోశయ్యను సముదాయించి పంపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్త బయటకు రావడంతో గుంటూరు వైసీపీలో తీవ్ర కల‌కలం రేగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: