ప్ర‌కాశం: టీడీపీ ల‌క్ష్మి Vs వైసీపీ శివ‌... న‌రాలు తెగే పోరులో గెలిచేది ఎవ‌రంటే..?

RAMAKRISHNA S.S.
దర్శి నియోజకవర్గం తీర్పు ఎప్పుడూ విలక్షణమే. ఇంకా చెప్పాలంటే... సీనియర్లను పక్కన పెట్టి... ఇక్కడ ఓటర్లు ఎప్పుడూ కొత్తవారికే పట్టం కడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఖరీదైన నియోజకవర్గంగా దర్శి పేరు. ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, దర్శి, కురిచేడు మండలాలున్నాయి. వీటిలో తాళ్లూరు మండలం పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం. దొనకొండలో మైనారిటీ, ఎస్సీ వర్గాలు. తాళ్లూరు, దొనకొండ మండలాల్లో వైసీపీకి 4 వేల మెజారిటీ వస్తుంది. కురిచేడు మండలంలో రెండు పార్టీలకు సమానంగానే ఓటు బ్యాంకు ఉంది. ముండ్లమూరు మండలంలో టీడీపీకి 3 వేల వరకు మెజారిటి వస్తుంది. దర్శి రూరల్‌ టీడీపీకి అనుకూలం. దీంతో దర్శి టౌన్ ఓట్లు ఇప్పుడు అత్యంత కీలకం.

దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాపు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే పోటీ చేశారు. తొలిసారి ప్రస్తుత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి ఓ మహిళ పోటీ చేస్తోంది. మహిళ పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి. దీంతో ఈసారి దర్శి నియోజకవర్గం ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక 2009లోనూ టీడీపీ నుంచి ఎన్నారై మ‌న్నే వెంక‌ట‌ర‌మ‌ణ పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014లో మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు పోటీ చేసి స్వ‌ల్ప మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు.

క‌ట్ చేస్తే 2019 ఎన్నిక‌ల టైంకు శిద్ధాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించిన చంద్ర‌బాబు.. ద‌ర్శి నుంచి అప్ప‌టి క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావును పోటీలో పెట్ట‌గా ఆయ‌న ఓడిపోయారు. ఆయ‌న పార్టీ మారిపోయాక మ‌ధ్య‌లో ప‌డిమి ర‌మేష్ లాంటి వాళ్లు కొద్ది రోజులు ఇన్‌చార్జ్‌గా ప‌నిచేసి వెళ్లిపోయారు. ఇక వైసీపీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య విబేధాలు రావడంతో... మద్దిశెట్టిని తప్పించి బూచేపల్లికి జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో కాపు సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

టీడీపీ నుంచి ప‌లువురు పేర్లు వినిపించినా చివరి నిమిషంలో డా.గొట్టిపాటి లక్ష్మీ పేరును టీడీపీ ప్రకటించింది. మాజీ మంత్రి సుధీర్ఘ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు కావడంతో.. ఆమెకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మద్దతు కూడా ఉంది. అన్న కుమార్తె కావడంతో.. లక్ష్మీ గెలుపు బాధ్యతలను రవి స్వయంగా చూస్తున్నారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే... ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గం ప్రజలు కొత్త వారికే పట్టం కట్టారు. సానికొమ్ము పిచ్చిరెడ్డి లాంటీ సీనియర్ నేత కూడా రెండోసారి ఓడిన వారే. క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి నేత‌ల మ‌ధ్య న‌రాలు తెగేలా జ‌రుగుతోన్న‌ హోరాహోరీగా జ‌రుగుతున్న సంగ్రామంలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో ?  ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: