చేనేత కులాలకు జగన్, చంద్రబాబు, మోడీ, పవన్ మొండిచేయి...ఒక్క సీటు కూడా ఇవ్వరా..?

ప్రభుత్వం నిర్మాణంలో అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేసినా కొన్ని కులాల వారు మాత్రమే పదవులను అనుభవిస్తున్నారు. రిజర్వేషన్ల ద్వారా వచ్చిన స్థానాలు తప్ప జనరల్ స్థానాల్లో అయితే బడుగు బలహీన వర్గాల నాయకులు పోటీలో ఉండరు. ఈ నేపథ్యంలోనే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో చేనేత కులాలకు మొండి చేయి చూపించారు. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్క పార్లమెంట్ టికెట్ కూడా చేనేత కులాలకు కేటాయించలేదు. ఇక ఎమ్మెల్యే టికెట్ల విషయానికి వస్తే వైసీపీ మంగళగిరి, ఎమ్మిగనూరు రెండు స్థానాలు ఇవ్వగా టీడీపీ కదిరి టికెట్ మాత్రమే ఇచ్చింది.

 దీంతో ఆ కులాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న కులాల వారికి 20 నుండి 30 సీట్లు కేటాయించారు. కానీ 65 లక్షల జనాభా ఉన్న చేనేత కులాలకు మాత్రం రెండు మూడు సీట్లు మాత్రమే కేటాయించడంపై చేనేత సామాజిక వర్గం బగ్గుమంటుంది. చేనేత సామాజిక వర్గంలో పద్మశాలీలు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతియ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బరిలో దిగుతున్నారు.

దీంతో కర్నూలు ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కు ఇస్తారని అదేవిధంగా చీరాల టికెట్ కూడా పద్మశాలి లేదా దేవాంగుల కులానికి సంబంధించిన వారికి ఇస్తారని భావించారు. కానీ టీడీపీ ఒక ఎంపీ టికెట్ కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యకరం. చీరాలలో 75 వేల మందికి పైగా పద్మశాలీలు ఉన్నారు. అక్కడ తెలుగు యువనేత పద్మశాలి కులానికి చెందిన రాజేష్ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టీడీపీ టికెట్ దక్కింది. మరోవైపు వైసీపీ కూడా చేనేతలకు ఒక్క ఎంపీ టికెట్ కేటాయించలేదు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ సీఎం మాడుగుల ఎమ్మెల్యే ముత్కాల నాయుడుకు అనకాపల్లి ఎంపీ టికెట్, ఆయన కుమార్తె తల్లి అనురాధకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఓకే కుటుంబంలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. కానీ చేనేత జిల్లాలో 65 లక్షలకు పైగా జనాభా ఉన్నవారికి ఒక టికెట్ కూడా ఇవ్వరా..? అంటూ చేనేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ , వైసీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు విషయంలో తమ వర్గానికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 18 శాసనసభ 5 లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల స్థాయిలో చేనేతలు ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదని తమకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: