ఓటు వేయకపోతే బ్యాంక్ ఖాతా నుంచి రూ.350 కట్..? నిజమెంత..?
ఈ స్వతంత్ర భారతదేశంలో ఓటు హక్కుని మించిన వజ్రాయుధం లేదని అంటారు. అందుకే తమ అమూల్యమైన ఓటు హక్కును వాడుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని మన పెద్దలు చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కుని కల్పించింది. కొందరు ఓటును వినియోగించుకోవడం అనేది హక్కుగా భావించి ఎంత దూరాన వున్నా స్వగ్రామాలకు వస్తూ వుంటారు. మరి కొందరు మాత్రం అది అంతా టైం వేస్ట్ అనుకొనే వారు లేకపోలేదు. ఇక ఓటేసే రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవులు ప్రకటిస్తున్నా కొంతమంది ప్రబుద్ధులు ఇంట్లోనే కూర్చుంటున్నారు తప్పా పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
ఇదెక్కువగా పట్టణాలు, నగరాల్లో జరుగుతోందని వినికిడి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పేపర్ క్లిప్ తెగ వైరల్‌గా మారింది. దాని సారాంశం ఒకసారి గమనిస్తే, ''ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయని యెడల మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.350 కట్ అవుతాయి. ఒకవేళ బ్యాంక్ ఖాతాలేని వాళ్లు అయితే వాళ్లు ఫోన్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఆ రీఛార్జ్‌ల నుంచి డబ్బులు కట్ అవుతాయి. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. ఆధార్ కార్డు ద్వారా ఓటు వేయని ఓటర్లను గుర్తించి ఖచ్చితంగా డబ్బులు కట్ చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు!'' అనేది దాని సారాంశం.
ఇదే విషయంపైన లోతుగా విశ్లేషిస్తే ఇది నిజమైన పేపర్ క్లిప్ కాదని అర్థం అయింది. అవును, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఫేక్ పేపర్ క్లిప్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటి వరకు అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఇలాంటి ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ ప్రకటనపై మాత్రం నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫేక్ అయినా కరెక్ట్‌గా చెప్పారని వారు కామెంట్స్ చేయడం కొసమెరుపు. ఈ క్రమంలో తిట్టేవారు కూడా లేకపోలేదు... ఓటేయమని సెలవు ఇస్తే.. తిని, తాగి ఇంట్లో పడుకుంటున్నారని తిట్టిపోస్తున్నారు. నిజంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలా ఓటుహక్కును వినియోగించుకోని వారి నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేలా చట్టం చేయాలని కూడా వారు కోరుతున్నారు.