సంచ‌ల‌నం: పులివెందుల బ‌రిలో విజ‌య‌మ్మ‌..?

RAMAKRISHNA S.S.
త‌మ్ముడు త‌మ్ముడే అన్న సామెత రాజ‌కీయాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అన్న‌పై త‌మ్ముడు పోటీ చేయ‌డం విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో క‌నిపిస్తోంది. ఇక‌, కూతురుపై తండ్రి పోటీ చేసిన ఘ‌ట‌న గ‌త 2019 ఎన్నిక‌ల్లో క‌నిపించింది. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలోనిపులివెందుల‌లోనూ చోటు చేసుకోనుంద‌ని తెలుస్తోంది. పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి సీఎం జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ రాని విధంగామెజారిటీ తెచ్చుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఇదే క‌డ‌ప పార్ల‌మెంటు స్తానంలో ప‌రిణామాలు మారిపోయాయి. క‌డ‌ప సీటునుంచి కాంగ్రెస్ టికెట్‌పై వైఎస్ ష‌ర్మిల పోటీ చేస్తున్నారు. ఈ ప్ర‌భావం పులివెందుల‌పైనా ప‌డ‌నుంద‌ని అంటు న్నారు. ఇక‌, ఇక్క‌డ నుంచి వైఎస్ కుటుంబానికే చెందిన సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి వైసీపీ త‌ర‌ఫున మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు.  ఇదిలావుంటే.. మ‌రో సంచ‌ల‌నం ఇక్క‌డ చోటు చేసుకుంటోం దని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 114 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

అయితే.. కీల‌క‌మైన పులివెందుల స్థానాన్ని ఎవ‌రికీ ప్ర‌క‌టించ‌లేదు. దీనిని తొలుత వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ‌కు కేటాయిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాలేన‌ని, వ‌య‌సు స‌హ‌కరించ‌ద‌ని ఆమె తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ దృష్టి అనూహ్యంగా వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌పై ప‌డింద‌ని తెలిసింది. ఆమెను పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోనియాగాంధీనే విజ‌య‌మ్మ‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు సమాచారం.

గురువారం విజ‌య‌మ్మ‌ను ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ అధిష్టానం ఆమె ముందు ఈ ప్రతిపాద‌న పెట్ట‌నున్న ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే క‌డప నుంచి వైఎస్ ష‌ర్మిల‌ను పోటీకి ఒప్పించిన కాంగ్రెస్ పార్టీ పులివెందుల నుంచి విజ‌య‌మ్మ‌ను దింప‌డం ద్వారా.. రాష్ట్రంలో మ‌రింత ఇమేజ్ సంపాయించుకు నే వ్యూహాత్మ‌కంగా ఎతుగ‌డ వేసిన‌ట్టు తెలిసింది. అయితే.. ఇక్క‌డ నుంచి విజ‌య‌మ్మ కుమారుడు, సీఎం జ‌గ‌న్ పోటీలో ఉన్నారు. దీంతో విజ‌య‌మ్మ దీనికి ఒప్పుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం తీవ్ర‌మైన  ఒత్తిడి ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: