మెదక్ : ఇప్పటికే పట్టులేదు.. ఇప్పుడు నీలం - కాటా మధ్య గ్యాప్.. కాంగ్రెస్ గెలిచేనా?

praveen
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ గులాబీ దళపతి కేసీఆర్కు రేవంత్ వరుసగా షాక్ లు ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో కెసిఆర్ సొంత జిల్లా అయినా మెదక్లో విజయం సాధించి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఇక ఎన్నో చర్చల తర్వాత మెదక్ ఎంపీ టికెట్ను బీసీ అభ్యర్థి నీలం మధు కి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఆయన గతంలో సర్పంచ్ మినహా ఇతర పదవులు చేపట్టిన అనుభవం లేకపోయినప్పటికీ.. ఆయన చేసిన సేవా కార్యక్రమాల కారణంగా పటాన్చెరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది.

 కానీ పార్లమెంట్ ఎన్నికలు గెలవాలంటే ఒక్క నియోజకవర్గంలో పట్టు ఉంటే సరిపోదు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పట్టు సాధించాలి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు అందరిని కూడా వెంటబెట్టుకుని ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నీలం మధు ముందుకు సాగుతుంటే.. ఇక ఇప్పుడు సొంత పార్టీ మీద నుంచి ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కూడా నీలం మధు, కాటా శ్రీనివాస్ మధ్య ఉప్పు నిప్పు అన్న విధంగా వివాదాలు కొనసాగుతున్నాయ్. గతంలో ఏకంగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి.. టికెట్ దక్కించుకున్నాడు నీలం మధు.

 కానీ ఆ తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నిరసనలు చేయడంతో మళ్ళీ అధిష్టానం ఆయనను పోటీ నుంచి తొలగించి కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇచ్చింది.  అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గూడ మైపాల్ రెడ్డి చేతిలో 7000 ఓట్లు తేడాతో ఓడిపోయారు కాట శ్రీనివాస్ గౌడ్. అయితే బిఎస్పీ నుంచి పోటీ చేసిన నీలం మధుకి 40  వేల ఓట్లు వచ్చాయి. ఇలా నీలం మధు తన ఓట్లను చీల్చడం వల్లే చివరికి తాను ఓడిపోవలసి వచ్చింది అని కాటా శ్రీనివాస్ గౌడ్ మనసులో ఒక భావన బలంగా పాతుకు పోయిందట. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విధంగా గ్యాప్ కొనసాగుతుందట. అయితే ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగానే పార్లమెంట్ పరిధిలోని చాలామంది కాంగ్రెస్ నేతలను కలిశారు నీలం మధు. కానీ ఇప్పటివరకు కాటా శ్రీనివాస్ గౌడ్ ను మాత్రం కలవలేదు. మరోవైపు కాటా కూడా నీలం మదును కలిసే ప్రయత్నం చేయలేదు. ఇలా ఒకరకంగా నీలం మధుకి సపోర్ట్ చేయడానికి కాట అసలు ఇష్టపడటం లేదట. ఇలా పార్టీ నేతల మధ్య గ్యాప్ చివరికి ఓటమికి కారణమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: