ఏపీ: టీడీపీ పక్కన పెట్టిన అభ్యర్ధికి, జనసేన టికెట్ ఎందుకిచ్చినట్టో..?

Suma Kallamadi

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇరు పార్టీలు తమదైన రీతిలో ప్రచారాలు షురూ చేసాయి. ఈ తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్ అనేది ఆయా నేతలకు, కార్యకర్తలకు ఒకింత తలనొప్పిగా మారింది అనడంలో సందేహమే లేదు. బహుశా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో కూడా అన్ని ట్విస్ట్‌లు ఉండవేమో అన్న రీతిలో ఆయా పార్టీల అసెంబ్లీ అభ్యర్థి ఎంపికలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విషయం ఏమిటంటే, సర్వే రిపోర్ట్స్‌ బాగాలేవని టీడీపీ పక్కన పెట్టిన అభ్యర్థికి ఇప్పుడు జనసేన రెడ్ కార్పెట్ వేసి మరీ టీ గ్లాస్‌ చేతిలో పెట్టి టిక్కెట్‌ ఇస్తోంది. ఈ క్రమంలోనే అసలు టీడీపీ కాదనుకున్న లీడర్‌ జనసేన అభ్యర్థిగా ఎలా తెర మీదికి వచ్చారు? అనే ప్రశ్నలు చాలామంది మదిలో మెదులుతున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన బరిలోకి దిగుతున్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అవనిగడ్డ అనే సంగతి అందరికీ తెలిసినదే. అది ఫైనల్ అయిననాటినుండి ఇక్కడ అభ్యర్థిని ఫైనల్ చేయటానికి పార్టీ చేసిన కసరత్తు న భూతో న భవిశ్యతి. జిల్లాలో మిగతా రెండు పార్టీలు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పవన్ మాత్రం అవనిగడ్డను అలానే పెండింగులో పెట్టడం కొసమెరుపు. మొదట అవనిగడ్డ కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ అయిన విక్కుర్తి శ్రీనివాస్ పేరు దాదాపు ఖారారైనట్టు వార్తలు వచ్చాయి. అందుకే శ్రీనివాస్ ఆర్థిక స్థోమతపై స్క్రీనింగ్ కూడా జరిగిందట. ఆయనతో స్వయంగా పవన్ కల్యాణే రెండు మూడు సార్లు భేటీ అయినట్టు సమాచారం.
ఈ హడావుడంతా చూసిన జనసేన లీడర్స్‌, కార్యకర్తలు టిక్కెట్‌ ఆయనకే ఇస్తారని క్లారిటీకి వచ్చారట. మరి ఏం జరిగిందో ఆ దేవుడికెరుక గానీ అనుకోకుండా మండలి బుద్దప్రసాద్‌ తెరమీదికి వచ్చారు. టిక్కెట్‌ హామీతోనే ఆయన పార్టీ కండువా మార్చినట్టు భోగట్టా. ఇదే ఇప్పుడు లోకల్‌ కేడర్‌కు మింగుడు పడటం లేదు. ఎందుకంటే ఆ మనిషిని కావాలనే పక్కన పెట్టేసింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్వేదంతో కూడిన స్పీచ్ లు, సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కూడా జరిగింది. డబ్బులున్న వారికే టిక్కెట్లు, డబ్బులకే పార్టీ సీట్లు ఇస్తోందని విమర్శించారు. ఓ దశలో అయితే ఆయన వైసీపీలోకి వెళ్తారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు జనసేన కండువా కప్పుకోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: