రాయ‌ల‌సీమ‌: క‌డ‌ప పార్ల‌మెంటుపై ఫ‌స్ట్ టైం పసుపు జెండా...!

RAMAKRISHNA S.S.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. వచ్చే సాధారణ ఎన్నికలలో కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో షర్మిల పేరు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక చరిత్రలో కడప పార్లమెంటు సీటును చాలా ఏళ్ల తర్వాత తాము గెలుస్తామని తెలుగుదేశం లెక్కలు వేసుకుంటుంది. ఇక్క‌డ టీడీపీ చివ‌రి సారిగా ఎప్పుడో 40 ఏళ్ల క్రింద‌ట మాత్ర‌మే గెలిచింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నారాయ‌ణ రెడ్డి గెలిచారు. కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా.. జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి ఉన్నారు.

అయితే ఆయన బాబాయ్ మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు లెక్కలు వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలోకి దింపి.. ఆదినారాయణ రెడ్డిని బిజెపి తరఫున కడప పార్లమెంటుకు పోటీ చేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి.. మరోసారి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు.

షర్మిల, అవినాష్ రెడ్డి ఓట్లు బలంగా చీల్చితే.. ఇటు ఆదినారాయణ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తే.. కనీసం నాలుగు లక్షల ఓట్లు వచ్చినా.. ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా ఉన్న భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ బరిలోకి దింపి.. ఆదినారాయణ రెడ్డిని పార్లమెంటుకు పోటీ చేయించాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఈ మార్పు జరగాలంటే బీజేపీ అధిష్టానం ఒప్పుకోవాల్సి ఉంటుంది.

ఇక కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న షర్మిల ఏ మేరకు ప్రభావం చూపుతారు.. అన్నదానిపై ఇక్కడ వైసీపీ గెలుపు ఆశ‌లు ఆధారపడి ఉన్నాయి. షర్మిల విజయం సాధించకపోయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు.. వైయస్ఆర్ కుటుంబ అభిమానులు ఓట్లు బలంగా చేర్చగలిగితే.. అది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: