గోదావ‌రి: ప‌వ‌న్‌ను ఓడించిన ఆ ఓట‌ర్లు ఈ సారైనా జ‌న‌సేనను గెలిపిస్తారా..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా బరిలోకి దిగారు. దీంతో భీమవరంలో ఫలితం ఎలా వస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఫలితాల్లో పవన్ చ‌తికిలపడ్డారు. పవన్ పై వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. అలా జనసేనానిని ఓడించిన నియోజకవర్గంగా భీమవరం రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి పవన్ ఎక్కడ నుంచే పోటీ చేస్తారంటూ ముందు ప్రచారం జరిగిన పవన్ భీమవరం వదులుకుని కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే పొత్తులో భాగంగా భీమవరం చేటును జనసేన తీసుకుంది.

ఇక్కడ నుంచి నిన్న మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు జనసేన కండువా కప్పుకుని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంజిబాబు ఎవరో కాదు ? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు కావడం విశేషం. మరి ఈసారి భీమవరం నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అవుతుంది అన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంజిబాబుకు స్వతహాగా మంచి పేరు ఉంది. అయితే మొన్న 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి నిన్న మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండటం నిజమైన జనసేన కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది.

అటు వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. జనసేన - తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరిగితే ఇక్కడ వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవాలి. అలా అని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై నియోజకవర్గ ప్రజలలో మరీ తీవ్రమైన వ్యతిరేకత అయితే లేదు. అయితే నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపులు - క్షత్రియులు - బిసి సామాజిక వర్గాలు కూటమి వైపు కొమ్ముకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎలా అయినా భీమవరం నియోజకవర్గంలో జనసేనకు మొగ్గు కనిపిస్తోంది. చివరలో పరిణామాలు ఏమైనా మరితే తప్ప గత ఎన్నికలలో ఓడించిన భీమవరం జనాలు ఈసారి జనసేన పార్టీని గెలిపించడం ఖాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: