గోదావ‌రి: టీడీపీలో ఎన్నారై జోరుతో వైసీపీ క్యాండెట్‌ బేజారు... జ‌గ‌న్‌కు ' చింత‌లు ' త‌ప్ప‌వా...!

RAMAKRISHNA S.S.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నుంచి ఎన్ఆర్ఐ సొంగా రోషన్ కుమార్ - వైసీపీ నుంచి మాజీ ప్రభుత్వ అధికారి కంభం విజయరాజు మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. విజయరాజు 2009లో చింతలపూడి ఎస్సీలకు రిజర్వ్ అయినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలన్న కోరికతో ఉన్నారు. ఎట్టకేలకు తాజా ఎన్నికలలో ఆయనకు వైసిపి నుంచి సీటు ఖరారు అయింది. ఇక సొంగా రోష‌న్ కుమార్ 2019 ఎన్నికలలోనే టిడిపి నుంచి టికెట్ కోసం విఫల ప్రయత్నం చేసి తాజా ఎన్నికలలో సీటు దక్కించుకున్నారు.

ఈ సీటు దక్కించుకునేందుకు రోష‌న్‌ కుమార్‌కు గట్టి పోటీ తప్పలేదు. కొద్ది నెలలు ముందుగానే విజయరాజుకు సీటు ఖరారు కావడంతో ఆయన ప్రచారంలో కాస్త ముందు ఉన్నారు. ఇద్దరు కూడా నియోజకవర్గానికి స్థానికులు కావడం విశేషం. రోష‌న్ కుమార్ కోరోనా టైం నుంచి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇటు విజయరాజు కూడా తన ఉద్యోగరీత్యా నియోజకవర్గంలో స్థానికులతో గత రెండున్నర దశాబ్దాల నుంచి విస్తృతమైన సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే టిడిపి - వైసిపి రెండు పార్టీలలోను అసంతృప్తులు.. అలకలు ఉన్నాయి.

విచిత్రం ఏంటంటే ఏ బలమైన నాయకులు అయితే విజయరాజుకు టికెట్ వచ్చేందుకు కష్టపడ్డారో.. ఇప్పుడు వారే విజయ రాజును వ్యతిరేకిస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గంలో బలమైన నాయకులుగా ఉండే వారంతా విజయరాజుకు సీటు ఇస్తే తాము సహకరించబోమని గత నాలుగైదు రోజులుగా తేల్చి చెబుతున్నారు. ఇది విజయరాజుతో పాటు నియోజకవర్గ వైసిపి కేడ‌ర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాను ఎవరి బలం మీద.. ఎవరి స‌హాయంతో సీటు దక్కించుకున్నానో అనూహ్యంగా రెండు మూడు నెలలలోనే వారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో విజయరాజు సైతం ఎలా ? ముందుకు వెళ్లాలి అనేదానిపై డైలమాలో పడిపోయినట్టు తెలుస్తోంది.

ఈ సమస్య కొలిక్కి రాకపోతే చింతలపూడి వైసిపి ఎన్నికల ముందు చేతులు ఎత్తేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు టిడిపి అభ్యర్థి రోషన్ కుమార్ ప్రచారంలో ఇంకాస్త స్పీడ్ పెంచాలి. రోషన్ లింగపాలెం మండలానికి స్థానికుడు కావడంతో పాటు నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ.. జంగారెడ్డిగూడెం మండలాల్లో టిడిపికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేయడంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. అటు చింతలపూడి మండలంలో మెజార్టీ సర్వేలు కూడా ఈసారి రోషన్‌కు అనుకూలంగానే ఉన్నట్టు చెబుతున్నాయి.

నియోజకవర్గంలోని రెండు పెద్ద మండలాలలో టిడిపికి సానుకూలత కనిపిస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్‌ 90% వరకు కలిసికట్టుగా ఏకతాటి మీదకు వచ్చి కసితో పనిచేస్తుండటం రోష‌న్‌ కు చాలా ప్లస్ కానుంది. దీనికి తోడు ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్లో చాలామంది తమకేందుకు అన్నట్టుగా లైట్ తీసుకుంటున్న వాతావరణం కూడా కనిపిస్తోంది.

వైసీపీలో ప‌రిణామాల‌తో అభ్య‌ర్థిగా ఉన్న విజ‌య‌రాజు వియ్యంకుడు, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ కొయ్యే మోషేన్‌రాజు ప‌రిణామాలు చ‌క్క‌దిద్దేందుకు చెమ‌టోడ్చుతున్నారు. ఏదేమైనా ఎన్నిక‌ల ప‌ర్వం వేడెక్కుతోన్న కొద్ది అటు టీడీపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తూ రోష‌న్‌కుమార్ స్పీడ్ పెంచుతుంటే.. ఇదే టైంలో ర‌క‌ర‌కాల ప‌రిణామాల‌తో వైసీపీ బేజార‌వుతోన్న ప‌రిస్థితి. ఇక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిణామాల‌పై పార్టీ అధినేత జ‌గ‌న్ సైతం దృష్టి సారించిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి జ‌గ‌న్ చింత‌ల‌పూడిలో వైసీపీ చింత‌ల‌ను ఎలా తీర్చేసి పార్టీని ట్రాక్ ఎక్కిస్తారో ?  నాలుగైదు రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: