ఏపీ : పని ఎక్కువ ఫలితం తక్కువ.. వాలంటీర్ల జీతాలను రూ.10 వేలు చేస్తారా?

Reddy P Rajasekhar
2019 సంవత్సంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టింది. ఇంటర్, డిగ్రీ చదివిన యువతీయువకులకు ఈ నియామకాల ద్వారా ప్రయోజనం చేకూరింది.  వైసీపీ గ్రామ, వార్డ్ వాలంటీర్లకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కేవలం 5000 రూపాయల వేతనం మాత్రమే అందిస్తోంది. కొన్ని నెలల క్రితం వాలంటీర్ల వేతనం పెంచినా ఆ పెంచిన మొత్తం చాలా తక్కువనే సంగతి తెలిసిందే.
 
దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు పని చేసిన తర్వాత కేవలం 750 రూపాయలు వేతనం పెంచడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వాలంటీర్లకు పని భారం ఒకింత ఎక్కువగానే ఉంది. సర్వర్ సమస్యల వల్ల పలు సందర్భాల్లో చేయాల్సిన పనులు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. వాలంటీర్లపై అభిమానం ఉంటే జీతం కనీసం 10,000 రూపాయలు చేయొచ్చుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
వాలంటీర్లపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు మాత్రం కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతూ ఉండటం గమనార్హం. వాలంటీర్ల వేతనం పెంచుతామని చంద్రబాబు చెబుతున్నా ఎప్పుడు పెంచుతారో ఎంత పెంచుతారో స్పష్టంగా చెప్పడం లేదు. వాలంటీర్లు 50000 సంపాదించేలా చేస్తానని చెబుతున్న బాబు 10,000 రూపాయలకు వేతనం పెంచుతానని మాత్రం హామీ ఇవ్వడం లేదు.
 
ఎన్నికల కోడ్ వల్ల వాలంటీర్ల విషయంలో నిబంధనలు అమలులోకి రావడంతో ఇప్పటికే ఏపీ ప్రజలకు కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భవిష్యత్తులో సైతం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించక తప్పదని చెప్పవచ్చు. వాలంటీర్లకు పనికి తగ్గ వేతనం అందితే వాళ్లు సైతం మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంటుంది. ఏపీ వాలంటీర్ల వ్యవస్థను చూసి ఇతర రాష్ట్రాలు సైతం ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ వల్ల రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: