ప‌ల్నాటి యుద్ధంలో గెలిచి నిలిచేది య‌ర‌ప‌తినేని శీనా.. కాసు మ‌హేషా...!

RAMAKRISHNA S.S.
కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన పల్నాటి యుద్ధం లో గురజాల - మాచర్ల రాజ్యల మధ్య ఎలాంటి పోరు ? జరిగిందో ఇప్పుడు పల్నాడు ముఖద్వారం అయిన గురజాల నియోజకవర్గంలోనూ అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్య అదే స్థాయిలో పోరు జరగనుంది. వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తుండ‌గా టిడిపి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే య‌రపతినేని శ్రీనివాసరావు రేసులో ఉన్నారు. 2019 ఎన్నికలలో నరసరావుపేట నుంచి వలస వచ్చిన కాసు మహేష్ రెడ్డి వైసీపీ వేవ్‌లో విజయం సాధించారు. ఐదేళ్ల పాలనలో కాసు మహేష్ రెడ్డి పై గురజాల నియోజకవర్గం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
చేశామ‌ని చెప్పుకుంటున్న పెద్ద పెద్ద ప‌నులు పూర్త‌వ్వ‌లేదు. మహేష్ రెడ్డి నాన్ లోకల్ అయినా కూడా తాము ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని, పార్టీ క్యాడర్‌ను ఏమాత్రం పట్టించుకోలేదన్న అసంతృప్తి.. అపవాదు గురజాల నియోజకవర్గ ప్రజలలో ఉంది. నియోజకవర్గ ప్రజల సంగతి అలా ఉంచితే కనీసం వైసిపి కేడర్ కూడా సంతోషంగా లేదు. నియోజకవర్గంలో తన రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ బీసీ నేతలను మహేష్ రెడ్డి దారుణంగా అనగదొక్కారన్న విమర్శలు ఉన్నాయి. గురజాల నియోజకవర్గం లో గతంలో వైఎస్ ఆ తర్వాత జగన్ వెంట ఉంటూ వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ బీసీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని మహేష్ రెడ్డి ఐదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పెట్టారు.
కాసు మ‌హేష్ రెడ్డి మార్క్‌తో త‌న‌కు చేసిన అవ‌మానం చెప్పుకుని ఓపెన్‌గానే జంగా ఎన్నోసార్లు బాధ‌ప‌డ్డారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే మహేష్ రెడ్డితో విభేదించిన జంగా కృష్ణమూర్తి తానే ఈ ఎన్నికలలో గురజాల నుంచి పోటీ చేస్తానని చెప్పినా జగన్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన తన కుమారుడు పిడుగురాళ్ల జడ్పిటిసితో కలిసి తెలుగుదేశంలో చేరేందుకు రెడీ అవుతున్నారు. కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ ఐదేళ్లలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు.. తన ఆస్తులు బాగా పెంచుకున్నారు అన్న విమర్శలు కూడా సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి.
నియోజకవర్గంలో పలువురు కీలక నేతలు ఇప్పటికే ఆయనకు దూరమయ్యారు. మరికొందరు ఇతర పార్టీలలో చేరిపోయారు. ఇక గత ఎన్నికలలో కాసు విజయంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం కీలక పాత్ర పోషించారు. య‌రపతినేని శ్రీనివాసరావు పై కోపంతో ఉన్న కొందరు తెలుగుదేశం నాయకులు.. కమ్మ సామాజిక వర్గం వారు లావు అండతో వైసిపికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారిపోవడంతో వారంతా తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. లావు క్యారెక్ట‌ర్ న‌చ్చి మ‌రి కొంద‌రు ఆయ‌న‌తో పాటే సైకిల్ ఎక్కేశారు. ఇటు జంగా కృష్ణమూర్తి కూడా టిడిపిలోకి వెళ్లడంతో బీసీలలో కూడా చాలామంది పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు కాసు పరిస్థితి అడ‌కత్తెర‌లో పోక చెక్కలా మారింది.
గత ఎన్నికలలో కాసుకు కలిసి వచ్చిన అనుకూల అంశాలు అన్నీ వ్యతిరేకం అయ్యాయి. ఇక టిడిపి నుంచి పోటీ చేస్తున్న య‌రపతినేని శ్రీనివాసరావు విషయానికి వస్తే గురజాల బ‌రిలో ఆయన వరుసగా ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆరుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలిచి.. మూడుసార్లు ఓడిన ఆయనపై ఈసారి ప్రజల్లో సంపతి ఉంది. వాస్తవంగా చూస్తే య‌రపతినేనికి మిగిలిన సామాజిక వర్గాలలో మంచి పట్టు ఉంది.. అందరిని కలుపుకుని వెళ్తారు అన్న పేరు ఉన్నా సొంత సామాజిక వర్గంలోనే కొందరు నేతలు ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి య‌రపతినేనికి ఈ విషయాన్ని చెప్పడంతో య‌రపతినని అటు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కలిసి ఈ సమస్యను చాలా త్వరగానే పరిష్కరించుకున్నారు.
నియోజకవర్గంలో య‌రపతినేనితో పాటు ఆయన కుమారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధితోపాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహిళల కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు సీమంతాలు, సారే చీరలు పంపిణీ ఇలాంటివి ఆయనకు మహిళల పట్ల ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేశాయి. ఏది ఏమైనా ఈ సారి పల్నాటి యుద్ధంలో య‌రపతినేని - కాసు మహేష్ రెడ్డి ఇద్దరు హోరా హోరీగా తెలపడుతున్నారు. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉన్న నరాలు తెగే ఉత్కంఠ అయితే తప్పేలా లేదు. మెజారిటీ సర్వేలు య‌రపతినేనికి స్వల్ప మొగ్గు ఉందని చెబుతుంటే.. కొన్ని సర్వేలు మాత్రం కాసు మహేష్ రెడ్డి స్వల్ప తేడాతో బయటపడతారని లెక్కలు వేస్తున్నాయి. అయితే రోజురోజుకీ ఇక్కడ ఆధిక్యం చేతులు మారుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: