చింత‌ల‌పూడి వైసీపీలో ఏం జ‌రుగుతోంది.. క్యాండెట్ విజ‌య‌రాజుకు టెన్ష‌న్‌..!

RAMAKRISHNA S.S.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సై రిజర్వ్‌డ్ సెగ్మెంట్లో అధికార వైసీపీలో ఏం జరుగుతుంది ? అంత గప్‌చుప్‌గా ఏం నడుస్తుంది ? అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాలలో సంచలనగా మారింది. కొద్ది నెలల క్రితం వైసీపీ సమన్వయకర్తగా కంభం విజయ రాజును జగన్ ఎంపిక చేశారు. ఆయ‌న‌కే సీటు కేటాయించారు. గత ఎన్నికలలో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజాకు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తో పాటు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో  కీలక నేత‌, మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడవరపు అశోక్ బాబు వర్గం సహకరించేది లేదని తేల్చి చెప్పడంతో ఎలీజాను తప్పించి విజయరాజుకు సీటు ఇచ్చారు.
2019 ఎన్నికలలోనే విజయరాజు సీటు కోసం విశ్వ‌ ప్రయత్నాలు చేశారు. తాజాగా ఎలీజాకు యాంటీగా ఎంపీ శ్రీధర్ వర్గం కూడా విజయరాజును స్వయంగా తెర మీదకు తెచ్చింది. తీరా నోటిఫికేషన్ వచ్చాక చూస్తే ఎంపీ వర్గంతో పాటు ఆ వర్గంలో కీల‌కంగా ఉండే మేడవరపు అశోక్ బాబు విజయరాజుకు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నట్టు తెలుస్తోంది. తాము గత ఐదేళ్లలో పార్టీ అధికారంలో ఉండి కూడా తమకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే ఎలీజా వర్గంతో పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. కనీసం నియోజకవర్గంలో చిన్న‌చిన్న ప‌నులు కూడా చేయ‌లేద‌ని.. ఎలీజాను మార్పించి విజయరాజుకు సీటు వచ్చేలా చేస్తే ఇప్పుడు విజయరాజు తమకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే ఎలీజా వర్గంతో చేతులు కలపటాన్ని ఎంపీ శ్రీధర్ వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది.
ఇప్పుడే ఇలా ఉంటే రేపు తాము ఎంతో కష్టపడి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గెలిపిస్తే విజయరాజు తమను అస్సలు పట్టించుకుంటాడా ? అన్న‌ నిర్ణయానికి కూడా ఎంపీ వర్గం నేతలు వచ్చేసారు. ఈ క్రమంలోనే విజయరాజు తీరు నిరసిస్తూ కామవరపుకోట లో కీలక నేతగా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ బాబుతో పాటు.. ఆయన భార్య కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మితో పాటు మండలంలోని అన్ని పంచాయితీలకు చెందిన ఎంపీ శ్రీధర్ వర్గం అనుచరులు తమ పార్టీ పదవులతో పాటు అన్ని పదవులకు రాజీనామాలు చేసేసారు. దీంతో చింతలపూడి నియోజకవర్గ వైసీపీలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అటు లింగపాలెం మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. గత మూడు రోజులుగా ఈ వ్య‌వ‌హారం జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది.
ఎంపీ శ్రీధ శ్రీధర్ రంగంలోకి దిగి అశోక్ తో చర్చలు జరుపుతున్నా అశోక్ మాత్రం తాను పట్టు వీడే లేదని విజయరాజు అభ్యర్థిత్వాన్ని మార్చి మరో వ్యక్తికి చింతలపూడి వైసీపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలపై అశోక్ మంగళ లేదా బుధవారాల్లో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు.. పార్టీ ప్రస్తుత స్థితిగతులపై చర్చించనున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు అపాయింట్‌మెంట్ కూడా ఖ‌రారైంది. ఆ తర్వాత అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుంది ? అసంతృప్త నేత‌ల‌కు, విజ‌య‌రాజ‌కు మ‌ధ్య ఎలా స‌ఖ్య‌త ఉంటుంది ? అన్న‌ది చూడాలి. ఏది ఏమైనా ఈ పరిణామాలతో చింతలపూడి వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. అటు పార్టీ అభ్యర్థి విజయరాజు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: