జగన్ : ఏపీ సీఎం చేస్తున్న 10 తప్పులివే.. సరిదిద్దుకోకపోతే మాత్రం షాకులు తప్పవా?

Reddy P Rajasekhar
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన చెప్పిన విధంగా ఏపీలో జగన్ పాలన సాగుతోంది. ఐదేళ్ల పాలనలో జగన్ ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే కొన్ని తప్పులను సరిదిద్దుకుని జగన్ ముందుకెళ్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఓటు కీలకమే. అందువల్ల జగన్ మరికొన్ని విషయాలలో మారాల్సిన అవసరం అయితే ఉంది.
 
మద్యపాన నిషేధం : 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన ప్రధాన హామీలలో ఇది ఒకటి కాగా ఈ హామీని నెరవేర్చడం ఆయనకు సాధ్యం కాలేదు. లోకల్ మద్యం బ్రాండ్స్ వల్ల చాలామందిలో కాలేయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం దిశగా జగన్ ముందడుగులు వేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
డీఎస్సీ : అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన జగన్ తక్కువ సంఖ్యలో డీఎస్సీ పోస్టులను భర్తీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
స్పందన కార్యక్రమం : స్పందనలో ఫిర్యాదు చేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని చాలామందిలో భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలామంది అధికారులు సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించామని వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలామంది సామాన్యులు నష్టపోతున్నారు.
 
రోడ్లు : ఏపీలో అన్ని ప్రాంతాలలో అని చెప్పలేం కానీ కొన్ని ప్రాంతాలలో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఆ రోడ్లలో ప్రయాణం చేయాలంటే నిత్యం నరకం కనిపిస్తోందని చాలామంది సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత : జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కు అనుకూలంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ అయితే తక్కువేనని చెప్పవచ్చు.
 
అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు : సీఎం జగన్ వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో సైతం కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చి ప్రజలను ఒకింత గందరగోళంలోకి నెట్టేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న కొంతమంది అభ్యర్థులకు జగన్ ఛాన్స్ ఇవ్వడం ఎంతవరకు రైట్ అనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చకపోవడం పార్టీకి మైనస్ అవుతోంది.
 
రైతులను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు : ఏపీలో 9 గంటల విద్యుత్ అమలు చేస్తున్నామని వైసీపీ చెబుతున్నా చాలా ఏరియాలలో 7 గంటల కరెంట్ మాత్రమే అమలవుతోంది. 7 గంటల కరెంట్ టైమింగ్స్ కూడా ఇష్టానుసారం ఉండటంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
 
అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల అమలు : జగన్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నా ఐదేళ్లలో రాష్ట్రం అప్పులు అంతకంతకూ పెరిగిపోయాయి. ఈ అప్పుల భారం వల్ల రాష్ట్రానికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాజధాని విషయంలో గందరగోళం : అమరావతినే రాజధానిగా జగన్ కొనసాగించి ఉంటే ఈపాటికి ఏపీలో కొంతమేర అభివృద్ధి అయినా జరిగేది. రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళం వల్ల ఏపీ అభివృద్ధి అంతకంతకూ ఆలస్యమవుతోంది.
 
ఆశించిన స్థాయిలో కంపెనీలు, పరిశ్రమలు రాకపోవడం : ఏ రాష్ట్రం అభివృద్ధికి అయినా పరిశ్రమలు, కంపెనీలు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే ఏపీకి పదుల సంఖ్యలో కంపెనీలు వస్తున్నట్టు వైసీపీ ప్రకటించినా ఆ లెక్కలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశపడిన యువతకు నిరాశ ఎదురైంది.
 
ఈ తప్పులు పునరావృతం కాకుండా జగన్ నుంచి కనీసం స్పష్టమైన హామీలు వస్తే బాగుంటుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: