గోదావ‌రి: బాల‌రాజు వ‌ర్సెస్ బాల‌రాజు వైఫ్‌... గెలిచేది ఎవ‌ర‌మ్మా అక్క‌డ‌...!

RAMAKRISHNA S.S.
2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో వైసిపి హవా నడిచింది. ఆ ఎన్నికలలో జగన్ ఓడిపోయిన కూడా రాష్ట్రంలో ఉన్న 7 ఎస్టి నియోజకవర్గాలలో వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక పోలవరం నియోజకవర్గం లో మాత్రం తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఆ ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన మొడియం శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికలలో ఇక్కడ వైసిపి అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత తెల్లం బాలరాజు ఏకంగా 44 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన తెల్లం బాలరాజుకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు.
అయితే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పీడికల రాజన్న దొరకు ఎస్టి కోటలో మంత్రి పదవి ఇచ్చారు. బాలరాజు సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇటు ప్రభుత్వం అధికారంలో ఉన్న చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. ఈ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వొద్దని నియోజకవర్గంలో ఒక వర్గం బలంగా వ్యతిరేకించింది. దీంతో జగన్ ఆయనకు బదులుగా ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బాలరాజుకు బదులుగా ఆయన భార్యకు ఎమ్మెల్యే సీటు ఇచ్చినా ఉపయోగం ఏం ఉంటుందని.. పెత్తనం మొత్తం బాలరాజు చేస్తారని తాము సహకరించం అంటూ వైసీపీలో కొందరు నేతలు రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇక కూట‌మిలో భాగంగా ఈ సీటును అనూహ్యంగా జనసేనకు కేటాయించారు. 2019 ఎన్నికలలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిర్రి బాలరాజుకు సీటు కేటాయించారు. వాస్తవంగా ఇక్కడ టిడిపి సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ తో పాటు ప్రస్తుతం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న బొర‌గం శ్రీనివాసులు ఇద్దరు విశ్వ ప్రయత్నాలు చేశారు. సీటు కచ్చితంగా టిడిపికి దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే చివరిలో అనూహ్యంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు.  నియోజకవర్గంలో తెలంగాణ నుంచి విడిపోయిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతో పాటు మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ మండలాల్లో వైసీపీ అభిమానులు ఎక్కువగా ఉన్నారు.
మైదాన ప్రాంతంలో టిడిపి బలంగా ఉంటే ఎస్టీలు ఎక్కువగా ఉన్న పంచాయతీలు గ్రామాలలో వైసీపీ బలంగా ఉంది. ఏజెన్సీలో జనసేన బలం అంతంత మాత్రమే కనిపిస్తోంది. మరి ఇక్కడ టిడిపి వాళ్ళు జనసేన గెలుపు కోసం మనసుపెట్టి పని చేస్తారా లేదా ? అన్న సందేహాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే పోలవరంలో జనసేన అభ్యర్థి గెలవడం అంత ఈజీ కాదని ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఇంకా ఎన్నికలకు 40 రోజులకు పైగా సమయం ఉండడంతో ఈలోగా పరిణామాలు ఎలా మారుతాయి.. జనసేన అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గంలో బలంగా ఉన్న టిడిపి క్యాడర్ గట్టిగా పనిచేస్తుందా ? సహకరిస్తుందా అన్నదానిని బట్టి ఇక్కడ  గ‌ట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: