గోదావ‌రి: నియోజ‌క‌వ‌ర్గం మారినా ఇద్ద‌రూ పాత ప్ర‌త్య‌ర్థులే... గెలిచేది ఎవ‌రంటే..!

RAMAKRISHNA S.S.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి అధికార వైసిపి.. ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య అదిరిపోయే పోరు జరగనుంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ వైసిపి నుంచి పోటీ చేస్తున్న తలారి వెంకట్రావు, టిడిపి నుంచి పోటీ చేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావు ఇద్దరు పక్కనే ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో పాత ప్రత్యర్థులు కావడం విశేషం. వీరిద్దరిది గోపాలపురం సొంత నియోజకవర్గం. 2014 ఎన్నికలలో ముప్పిడి తలారిపై విజయం సాధిస్తే.. 2019 ఎన్నికలలో తలారి వెంకట్రావు.. ముప్పిడి వెంకటేశ్వరరావు పై ఏకంగా 37వేలవాట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
జగన్ మార్పులు చేర్పులలో భాగంగా కొవ్వూరు నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్న హోం మంత్రి తానేటి వనితను గోపాలపురంకు మార్చి... తలారి వెంకట్రావు కొవ్వూరు కు మార్చారు. విచిత్రంగా తెలుగుదేశం కూడా గోపాలపురంలో టిక్కెట్ కోసం మద్దిపాటి వెంకట్రాజు తో పోటీపడిన మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కొవ్వూరుకు మార్చింది. దీంతో నియోజకవర్గం మారినా ఇక్కడ పాత ప్రత్య‌ర్థులే తలపడబోతున్నారు. బలాబలాల‌ పరంగా చూస్తే కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు నేప‌థ్యంలో కూటమి బలంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా హోం మంత్రి తానేటి వనిత పై తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో ఆమెను పక్కనే ఉన్న గోపాలపురంకు మార్చారు.
విచిత్రం ఏంటంటే ఆమె గోపాలపురంలో కూడా 2009లో టిడిపి నుంచి గెలిచారు. నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపుల గోల ఉంది. తలారిని మార్చినా ఆయనకు వనిత వ‌ర్గంతో పాటు వైసీపీలో కొంతమంది నాయకులు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో జనసేన సపోర్ట్ కూడా ఉండటం టిడిపికి ప్లస్ అయితే వైసీపీకి మైనస్ గా మారింది. ముప్పిడి వెంకటేశ్వరరావుకు స్వామ్యుడు అన్న పేరు ఉంది. కొవ్వూరు టిడిపి కేడర్ మాజీమంత్రి జవహర్ ను వద్దని ముప్పిడిని పట్టుబట్టి తమ నియోజకవర్గానికి మారిపించుకుంది.
ముందు జవహర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ముప్పిడిని ఓడిస్తానని శపధం చేసినా తర్వాత చంద్రబాబు పిలిచి సర్ది చెప్పడంతో ఆయన కాస్త కూల్ అయ్యారు. ఆయ‌న‌కు జాతీయ స్థాయి క‌మిటీలో ఛాన్స్ ఇచ్చారు. కొవ్వూరు టిడిపిలో కీలక నేతగా ఉన్న పెండ్యాల అచ్చిబాబు ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపులో కీలకం కానున్నారు. జవహర్ ను బలంగా వ్యతిరేకించిన నేతలతో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న నేతలు కూడా ఒకే తాటి మీదకు వచ్చి ఇప్పుడు ముప్పిడి గెలుపు కోసం గట్టిగా కష్టపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే కొవ్వూరులో టిడిపికి కాస్త సానుకూలత కనిపిస్తోంది. మరి ఎన్నికల టైం కు ఏమైనా మార్పులు జరుగుతాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: