అమరావతి : వారసులు ఏమిచేస్తారో ?

Vijaya

తొందరలో జరగబోయే ఎన్నికల్లో  వైసీపీ తరపున  చాలామంది వారసులు పోటీచేస్తున్నారు.  అందుబాటులోని సమాచారం ప్రకారం  ఎనిమిది మంది వారసులు ఎంఎల్ఏ, ఎంపీగా పోటీచేస్తున్నారు. సీనియర్లు చాలామంది తమ వారసులను పోటీలోకి దింపాలని ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి మాత్రం కొందరికే టికెట్లు కేటాయించారు. తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరెడ్డి తనకు బదులుగా కొడుకు అభినయ్ రెడ్డిని పోటీ చేయిస్తున్నారు. మచిలీపట్నం ఎంఎల్ఏ పేర్నినాని కొడుకు పేర్ని కృష్ణమూర్తికి టికెట్ దక్కింది.



చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బదులుగా ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రంగంలోకి దిగారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంఎల్ఏ షేక్ ముస్తాఫాకు బదులు కూతురు షేక్ నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి బదులు ఆయన కూతురు కృపాలక్ష్మి పోటీచేస్తున్నారు. అరకు ఎంఎల్ఏ చెట్టి ఫల్గుణకు టికెట్ నిరాకరించిన జగన్ ఆయన కోడలు  చెట్టి తనూజారాణికి అరకు ఎంపీ టికెట్ ఇచ్చారు. చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ కొడుకు కరణం వెంకటేష్ పోటీచేస్తున్నారు. పోలవరం ఎంఎల్ఏ తెల్లంబాలరాజుకు బదులు  ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు.



ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పెద్దలంతా దశాబ్దాలుగా ముందు కాంగ్రెస్ లోను తర్వాత వైసీపీలోను చాలా యాక్టివ్ గా ఉన్నవారే. నారాయణస్వామి, భూమన లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు మరో రెండు ఎన్నికల్లో పోటీచేసేంత ఫిజికల్ ఫిట్ నెస్ ఉన్నవారే అనటంలో సందేహంలేదు. కాని ఎందుకనో ప్రత్యక్ష ఎన్నికల నుండి తాము తప్పుకుని తమ వారసులను తెరపైకి తెచ్చేశారు. బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, చెన్నకేశవరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రఘురామిరెడ్డి లాంటి మరికొందరు ఎంఎల్ఏలు కూడా తమ వారసులకు టికెట్లివ్వాలని ఎంతడిగినా జగన్ ఎందుకనో అంగీకరించలేదు. చెన్నకేశవరెడ్డికి అసలు టికెట్టే ఇవ్వలేదు.



రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకంకాబట్టి సీనియర్లనే పోటీచేయాలని జగన్ గట్టిగా చెప్పారు. వారుసులను పోటీచేయించే విషయంలో  కొందరు విజ్ఞప్తిని అంగీకరించిన జగన్ మరికొందరి రిక్వెస్టును ఎందుకు తిరస్కరించారో మాత్రం అర్ధంకావటంలేదు. ఏదేమైనా సీనియర్లు మాత్రం జనాల్లో తిరుగుతు నియోజకవర్గాల్లో తమదైన ముద్రవేశారు.  మరి వీళ్ళ వారసులు ఏమిచేస్తారో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: