శభాష్‌ రేవంత్.. ఇది చక్కటి నిర్ణయం?

Chakravarthi Kalyan
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని గత ప్రభుత్వాలు ప్రకటించినా.. అవి మాటలకే పరిమితం అయ్యేవి. ఫలితంగా కరెంట్ బిల్లులు కట్టలేక చాలా పాఠశాలలకు విద్యుత్తు నిలిపివేత అనే వార్తలు మనం చాలానే చూశాం. కానీ ఇప్పటి నుంచి ఆ సమస్యలు కనిపించవు..

ఇక నుంచి పాఠశాలలకు మంచి రోజులు రాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పలు అంశాలు ఉద్యోగ సంఘాల నాయకులు  సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఐదేళ్లుగా పాఠశాలలు, కళాశాలకు సంబంధించి విద్యుత్తు బిల్లులు కట్టలేక ప్రధానోపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా పాఠశాలలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. దీంతో పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

కరెంట్  ఉచితంగా సరఫరా చేస్తే విద్యార్థులకు తాగునీటి సరఫరాతో పాటు మరుగుదొడ్లు, మూత్ర శాలలు, పాఠశాల గదులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవడంతో పాటు  డిజిటల్ పాఠాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అయితే పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నా.. అవి సరిపోకపోవడంతో విద్యుత్తు బిల్లులు చెల్లించడం గుదిబండగా మారాయి. ఈ క్రమంలో చాలా బడుల్లో విద్యుత్తు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ స్కూళ్లపై ఆర్థిక భారం తప్పనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు, ఇతర అవసరాల కోసం బోరు బావి నీటిని వినియోగిస్తున్నారు. కంప్యూటర్ ప్రయోగశాలలు, తరగతి గదులు, ఫ్యాన్లు, డిజిటల్ తరగతులకు ప్రొజెక్టర్లు, ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి వినియోగంతో కరెంట్ బిల్లులు పెరుగుతూ వచ్చాయి. పాఠశాల స్థాయిని బట్టి రూ.2 వేల నుంచి రూ.7 వేల  వరకు బిల్లులు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వీరికి ఈ భారం తగ్గనుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: