ఉత్తరాంధ్ర : నేతలు పవన్ను వాయించేస్తున్నారా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పార్టీ నేతలతో పాటు తెలుగుదేశంపార్టీ నేతలు కూడా మండిపోతున్నారట. ముఖ్యంగా అనకాపల్లి ఎంఎల్ఏగా కొణతాల రామకృష్ణకు టికెట్ ఇచ్చిన విషయంలో పవన్ పై అందరు మండిపోతున్నారట. కొణతాలను అభ్యర్ధిగా ప్రకటించటం వల్ల అనకాపల్లి పార్లమెంటులోని ఏడు అసెంబ్లీలు డిస్ట్రబ్ అయిపోయినట్లు రెండుపార్టీల్లోని నేతలు చెప్పుకుంటున్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేయాలని రెడీ అయిన నాగబాబు ఇపుడు వెనక్కు తగ్గటమే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.



ఎంపీగా పోటీచేసే విషయంలో నాగబాబే పునరాలోచిస్తుంటే ఇక మిగిలిన నేతల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదని రెండుపార్టీల్లోని నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన కొణతాలను  చివరినిముషంలో ఎంఎల్ఏ అభ్యర్ధిగా పవన్ ప్రకటించారు. అసలు కొణతాలను పార్టీలోకి చేర్చుకోవటంపైనే వ్యతిరేకిస్తున్న నేతలకు అసెంబ్లీ టికెట్ ప్రకటించటం మరింతగా మండిచింది. గడచిన పదేళ్ళుగా అసలు క్రియాశీల రాజకీయాల్లో లేని కొణతాలకు ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు.



టీడీపీ తరపున పీలా గోవింద్ సత్యనారాయణ అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించారు. అలాంటిది చివరినిముషంలో వచ్చిన కొణతాల టికెట్ తన్నుకోవటానికి పీలా తట్టుకోలేకపోతున్నారు. కొణతాలకు సహకరించాలని చంద్రబాబు పిలిచి పీలాతో మాట్లాడినా కుదరదని చెప్పి బయటకు వచ్చేశారు. అలాగే కొణతాలతో దశాబ్దాల వైరం ఉన్న దాడి వీరభద్రరావును సహకరించమని చంద్రబాబు అడిగితే కుదరదని చెప్పేశారట. అసలు ఈ సీటును ఆశించి మొదటినుండి కష్టపడి పనిచేసుకున్నది జనసేన నేత పరుచూరి భాస్కరరావు.



పరుచూరికి టికెట్ ఇస్తానని పవన్ హామీ ఇస్తేనే ఆయన టీడీపీలో నుండి జనసేనలోకి మారింది. ఇంతకాలం నియోజకవర్గంలో ఎంతో ఖర్చులు పెట్టుకుని తిరుగుతున్న పరుచూరిని కాదని చివరినిముషంలో కొణతాలకు పవన్ టికెట్ ఇవ్వటాన్ని పరుచూరి తట్టుకోలేకపోతున్నారు. ఇలా ఏ కోణంలో చూసినా కొణతాలకు, పవన్ కు చుక్కెదురే అవుతోంది. మరి వీళ్ళంతా సహకరించకపోతే చివరకు కొణతాల పరిస్ధితి ఏమవుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: