జనసేనకు తక్కువ సీట్లు.. టీడీపీ ఫెయిలైందా?

Chakravarthi Kalyan
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయా? పొత్తులో లభించిన సీట్లు ఆమోదయోగ్యంగా లేవా? ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదా? అది పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీస్తుందా? ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలను కేటాయించారు. దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెర పడింది.

50 అసెంబ్లీ స్థానాలు, పది వరకు ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా జనసేన అడిగినట్లు టాక్ నడిచింది. అప్పుడే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగుతుంది అని.. కాపు ఓటు బ్యాంకు కూటమి వైపు మళ్తుందని రకరకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ జనసేన సీట్ల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పవన్ ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తగానే ఉన్నారు. బలానికి మించి సీట్లు అడిగితే అది ప్రత్యర్థికి మేలు చేకూరుస్తుందని పార్టీ శ్రేణులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు.

ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే.. ఇచ్చిన సీట్లలో అత్యధికంగా గెలవడమే ఉత్తమమని సెలవిచ్చారు. కానీ అధినేత మాటలకు పార్టీ నాయకులు సంతృప్తి చెందలేదు. ఇంత తక్కువ  స్థానాలు కేటాయిస్తారా అని బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని తక్కువ సీట్లతో పవర్ షేరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. జనసేనలోని సీనియర్ నేతలు అయితే తెగ బాధపడుతున్నారు.

అయితే పార్టీ శ్రేణులు నొచ్చుకుంటే ఓట్ల బదలాయింపు జరగదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. పవన్ ను సీఎంగా చూడాలన్నది జనసైనికుల లక్ష్యం. కాపులకు రాజ్యాధికారం దక్కాలన్నది వారి అభిమతం. కానీ ఇంత తక్కువ సీట్లతో ఇది ఎలా సాధ్యం అనే అసంతృప్తి జనసైనికులతో పాటు కాపు నేతల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే నలభై రోజుల్లో వీరిని సైకలాజికల్ గా బాగా ప్రిపేర్ చేస్తేనే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. లేకపోతే టీడీపీ వ్యూహం విఫల ప్రయోగంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: