గోదావరి : పవన్ను వెంటాడుతున్న జోగయ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుదారుడిగా ఉన్న కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య ఇపుడు ఏకుమేకై కూర్చున్నారు. మొదట్లో పవన్ కు శ్రేయోభిలాషిగా సలహాలిచ్చిన జోగయ్య ఇఫుడు మాత్రం గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నారు. డిమాండ్లు కూడా హెచ్చరికల స్ధాయి దాటిపోయి బెదిరింపుల్లోకి దిగేసింది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీచేయాలనే విషయంలో పవన్ కు వరుసబెట్టి లేఖలు రాస్తున్నారు. ఈ లేఖలతో పవన్ కు మహా చిర్రెత్తిపోవటం ఖాయం.
ఇపుడు విషయం ఏమిటంటే తాజాగా రాసిన లేఖలో జనసేన 63 నియోజకవర్గాల్లో పోటీచేయాలని చెప్పారు. కాపులు, తూర్పుకాపులు 40 సీట్లలో పోటీచేయాలని, కాపుల్లోని మిగిలిన ఉపకులాలు 23 సీట్లలో పోటీచేయాలని జోగయ్య గట్టిగా డిమాండ్ వినిపించారు. ఇందుకనే చంద్రబాబునాయుడుతో గట్టిగా మాట్లాడి 63 సీట్లను తీసుకోవాల్సిందే అని చేగొండి లేఖలో పవన్ను డిమాండ్ చేశారు. జోగయ్య డిమాండ్లు పవన్ను చికాకు పెట్టేస్తుంటాయనటంలో సందేహంలేదు.
ఎందుకంటే చంద్రబాబు 25 సీట్లలో పోటీచేయమని అంటే పవన్ రెడీ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జోగయ్యేమో 63 సీట్లకు తక్కువ తీసుకుంటే ఉపయోగం ఉండదని పదేపదే చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేనకు ఏడు అసెంబ్లీలకన్నా ఎక్కువ ఇవ్వటానికి చంద్రబాబు ఇష్టపడటంలేదని ఎల్లోమీడియాలో వచ్చిన కథనాన్ని జోగయ్య ప్రస్తావించారు. పైగా జనసేన గెలుస్తుందని అనుకుంటున్న సీట్లను కాకుండా టీడీపీ ఓడిపోతుందని అనుకునే సీట్లనే చంద్రబాబు మిత్రపక్షాలకు కేటాయిస్తారన్న విషయాన్ని జోగయ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఏదేమైనా పవన్ అంగీకరించారనే ప్రచారం జరుగుతున్న సీట్ల సంఖ్యకు జోగయ్య పోటీచేయాలని సూచిస్తున్న సంఖ్యకు దాదాపు 40 సీట్లు తేడా కనబడుతోంది. వాస్తవం ఏమిటంటే ఇన్ని సీట్లు తీసుకోవటం పవన్ కే ఇష్టమున్నట్లు లేదు. అలాంటిది మరి జోగయ్య జోరీగలాగ పవన్ కు లేఖల మీద లేఖలు రాయటంలో ఉపయోగం ఏమిటో అర్ధంకావటంలేదు. సీట్ల సర్దుబాటులో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరుకాని పవన్ను ఉద్దేశించి జోగయ్య రాస్తున్న లేఖలతో కాపుల్లో మాత్రం చర్చలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.