మాదిగలకు బాబు ఇచ్చిన వరం.. సుప్రీంకోర్టు ఇస్తుందా?

Chakravarthi Kalyan
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీల వర్గీకరణ చేస్తూ బిల్లు తీసుకువచ్చారు. అయితే ఆ బిల్లుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మార్చేయాలా లేదా అనే దానిపై ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్ధానంలో విచారణ కొనసాగుతోంది.  విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం దీనిని చేపట్టింది. రాష్ట్రాలకు అటువంటి అధికారం ఉండదని పార్లమెంట్ లకు మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయగలదని పేర్కొంటూ 2004లో వెలువడిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెల్లుబాటు పరిశీలిస్తామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. అయితే ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లలో 50శాతం ఉప కోటాను కల్పించడాన్ని పంజాబ్ ప్రభుత్వం ఏ సమాచారంతో ఆధారపడిందనే వాదనల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు.

ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ ప్రభుత్వ ఎస్సీ కోటా రిజర్వేషన్ల ఉప వర్గీకరణ ఉందని పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో వెలువరించిన ఉత్తర్వులో అభిప్రాయపడింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగ అధికరణం 14 కు భంగం కలిగించేలా ఉందని సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో పేర్కొంది.

షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా.. తొలగించాలన్నా పార్లమెంట్ కు మాత్రమే అధికారం ఉందని.. రాష్ట్రాల శాసన సభకు కాదని 2004లో తీర్పు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు తమ రాష్ట్రానికి వర్తించదని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పును ఆక్షేపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విషయాలను చేర్చింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టులోనని అయిదుగురు సభ్యుల ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయలని సిఫార్సు చేసింది. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: