రాయలసీమ : వివేకాకే దిక్కులేదు...
రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు షర్మిల, సునీత ఏకమయ్యారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కుటుంబపరమైన కారణాలతో షర్మిల, సునీత ఇద్దరు జగన్ కు బద్ధవిరోధులుగా మారిన విషయం తెలిసిందే. వివేకాహత్యతో ఆయన కూతురు వైఎస్ సునీత, ఆస్తి తదితర గొడవలతో సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఇద్దరు జగన్ కు వ్యతిరేకంగా చేతులు కలిపారు. ఈ ఇద్దరు ఇడుపులపాయలో రెండుగంటలు భేటీ అయ్యారు.
కామన్ శతృవైన జగన్ను ఢీ కొనాలంటే తామిద్దరి కుటుంబాల నుండే కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీకి పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. బహుశా పార్లమెంటుకు వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీచేసే అవకాశాలున్నాయి. మరి పులివెందుల అసెంబ్లీకి ఎవరు పోటీచేస్తారో సస్పెన్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన తండ్రి హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్రకూడా ఉందని సునీత పదేపదే ఆరోపించారు. అయితే అందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపించలేకపోయారు. సీబీఐ కూడా వీళ్ళిద్దరిని అరెస్టుచేయాలని ప్రయత్నించినా సాధ్యంకాక భాస్కర్ రెడ్డి అరెస్టుతో సరిపెట్టుకున్నది.
హత్యలో అవినాష్ పాత్ర కూడా ఉందని గుగుల్ టేకౌట్ సాంకేతికతతో మొదట్లో వాదించిన సీబీఐ తర్వాత తన ఆరోపణలన్నింటినీ కోర్టు విచారణలో విత్ డ్రా చేసుకున్నది. సరే ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఇద్దరి కుటుంబాల్లో ఎవరు ఎక్కడ పోటీచేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 2011లో జరిగిన ఉపఎన్నికలో విజయమ్మకు పోటీగా వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. విజయమ్మకు 1.10 లక్షల ఓట్లొస్తే వివేకాకు వచ్చింది కేవలం 28,725 మాత్రమే. వైఎస్ కుటుంబానికి జిల్లాలో ఇంత పట్టుందంటే మొదటి వైఎస్సార్ వల్ల, ఇపుడు జగన్ కారణంగా మాత్రమే. మిగిలిన వాళ్ళంతా వైఎస్ అన్న ఇంటిపేరుతో చెలామణి అవ్వాల్సిందే.
కాబట్టి షర్మిల, సునీత కుటుంబాల్లో ఎవరు పోటీచేసినా ఎలాంటి ప్రభావం కనిపించదు. వివేకా పోటీచేస్తేనే ఓట్లు రానపుడు ఇక వీళ్ళకుటుంబాల్లో వాళ్ళు పోటీచేస్తే ఓట్లు పడతాయా ? విషయం ఏమిటంటే చెల్లెళ్ళు ఇద్దరు కూడా జగన్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎల్లోమీడియా మ్యాగ్జిమమ్ కవరేజ్ ఇస్తోంది. రేపటి ఎన్నికల తర్వాత వీళ్ళు మాట్లేడేది ఉండదు, ఎల్లోమీడియా కవరేజీ కూడా ఉండదు. అప్పుడు తమ పరిస్ధితి ఏమిటో వీళ్ళిద్దరికీ బాగా అర్ధమవుతుంది.