హోటల్ స్టైల్ లో ఇడ్లీ, దోసె చేయాలా.. ఈ క్రేజీ చిట్కాలు పాటిస్తే చాలు!
దక్షిణ భారతదేశ వంటకాలలో ఇడ్లీ, దోసెలకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. మెత్తగా, నోరూరించే ఇడ్లీలు, క్రిస్పీగా, రుచికరమైన దోసెలు టిఫిన్ మెనూలో ఎప్పుడూ ముందుంటాయి. అయితే, మనం ఇంట్లో చేసినప్పుడు అవి హోటల్ స్టైల్ రుచిని, మెత్తదనాన్ని అందుకోలేక పోతున్నాయనే చింత చాలా మందికి ఉంటుంది. మీరైతే, ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కొన్ని క్రేజీ చిట్కాలను పాటిస్తే చాలు... మీరూ ఇంట్లోనే అచ్చం హోటల్ స్టైల్ ఇడ్లీలు, దోసెలు తయారు చేయవచ్చు!
హోటల్ స్టైల్ టిఫిన్ కావాలంటే, సరైన పదార్ధాల ఎంపిక అత్యంత ముఖ్యం. ముఖ్యంగా ఇడ్లీ రవ్వ కాకుండా, ఇడ్లీ బియ్యాన్ని (లేదా లావు బియ్యం) మాత్రమే వాడాలి. ఇవి ప్రత్యేకంగా ఇడ్లీల కోసం అమ్ముతారు. దోసె క్రిస్పీగా ఉండాలంటే, సాధారణ రేషన్ బియ్యం కాకుండా, పొట్టి బియ్యం (Sona Masuri or raw Rice) ఉపయోగించడం మంచిది. రెండు రకాల టిఫిన్లకు గుండు మినప్పప్పు (పొట్టు లేనిది) వాడండి. ఇది మంచి పిండికి బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
బియ్యం, మినప్పప్పులను కనీసం 5 నుండి 6 గంటల పాటు బాగా నానబెట్టాలి. నానబెట్టేటప్పుడు, ఒక టీస్పూన్ మెంతులను మినప్పప్పుతో పాటు తప్పకుండా వేయండి. ఇది ఇడ్లీకి అదనపు మెత్తదనాన్ని, దోసెకు మంచి రంగును, రుచిని ఇస్తుంది. ఇడ్లి తయారు చేయాలంటే 1 కప్పు మినప్పప్పుకు 2.5 లేదా 3 కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకోవాలి. దోసె కోసం 1 కప్పు మినప్పప్పుకు 3 లేదా 4 కప్పుల పొట్టి బియ్యాన్ని వాడాలి. ఇడ్లీ పిండి నూరేటప్పుడు, ఒక గుప్పెడు అటుకులను కూడా నానబెట్టి కలపండి. ఇది ఇడ్లీని దూదిలా మెత్తగా చేస్తుంది
మినప్పప్పును వేరుగా రుబ్బండి. రుబ్బేటప్పుడు చల్లటి నీళ్లు లేదా ఐస్ వాటర్ మాత్రమే వాడండి. దీనివల్ల రుబ్బేటప్పుడు వేడి పుట్టకుండా, పప్పు బాగా పొంగి, నురుగులా వస్తుంది. ఇది ఇడ్లీ, దోసె మెత్తదనానికి ముఖ్య కారణం. మినప్పప్పును వీలైనంత మెత్తగా, నున్నగా రుబ్బాలి. పిండి బాగా గాలి పీల్చుకున్నట్లు ఉండాలి. బియ్యాన్ని మాత్రం కొంచెం రవ్వ రవ్వగా ఉండేలా రుబ్బాలి. మినప్పప్పు పిండి, బియ్యం పిండి కలిపేటప్పుడు చెయ్యి ఉపయోగించండి. చేతి వేడి పిండి త్వరగా పులియడానికి సహాయపడుతుంది. ఉప్పు మాత్రం పులిసిన తర్వాత మాత్రమే కలపాలి. ముందు కలిపితే పులియడం ఆలస్యమవుతుంది. పిండిని ఒక వెచ్చని ప్రదేశంలో ఉంచండి. చలికాలంలో అయితే, ఓవెన్‌లో లేదా కిచెన్ కేబినెట్‌లో లైట్ వేసి ఉంచితే, సుమారు 8 నుండి 12 గంటల్లో పిండి చక్కగా పులుస్తుంది. పిండి రెట్టింపు అయ్యే వరకు ఆగాలి.
దోసె పిండి ఇడ్లీ పిండి కంటే కాస్త పలచగా ఉండాలి. అవసరమైతే కొంచెం నీరు కలపండి. దోసె వేసే ముందు పెనం (తవా) చాలా వేడిగా ఉండాలి. పిండి వేయగానే మంట తగ్గించి వేయాలి. దోసె వేసే ముందు పెనంపై ఒక చెంచా నూనె వేసి, సగానికి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కతో పెనాన్ని తుడుచుకోవాలి. దీనివల్ల దోసె ఎక్కడా అంటుకోకుండా చక్కగా వస్తుంది.
ఈ క్రేజీ చిట్కాలన్నీ పాటించి చూడండి. మీ ఇంట్లో తయారైన ఇడ్లీలు, దోసెలు పక్కా హోటల్ రుచిని తలపిస్తాయి. రుచితో పాటు, మీ టేబుల్ మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.