ఉత్తరాంధ్ర : గంటా తట్టుకోలేకపోతున్నారా ?

Vijaya

తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆమోదించటాన్ని టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు తట్టుకోలేకపోతున్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తు  2021లో గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో చేసిన రాజీనామాను ఇపుడు స్పీకర్ ఆమోదించటం ఏమిటని గంటా మండిపోతున్నారు. రాజీనామా ఆమోదంలో కుట్రుందని ఆరోపిస్తున్నారు. అందుకనే స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తానని బెదిరిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే తన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు ఒకవైపు చెబుతునే మరోవైపు స్పీకర్ నిర్ణయంపై కోర్టులో కేసు వేస్తారట.



గంటా మాటలు విన్నతర్వాత తానేం మాట్లాడుతున్నారో తనకు అర్ధమవుతున్నట్లు లేదని తెలిసిపోతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయటం గంటా ఇష్టం. రాజీనామాను ఎప్పుడు ఆమోదించాలన్నది స్పీకర్ ఇష్టం. అప్పట్లో ఎంఎల్ఏ రాజీనామా చేశారు, స్పీకర్ ఇపుడు ఆమోదించారు. రాజీనామాను ఆమోదించటంలో  స్పీకర్ కుట్రేముంది ? తొందరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలో తనను ఓటు వేయనీయకుండా చేసేందుకు స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని గంటా ఆరోపించటంలో అర్ధంలేదు.



ఎందుకంటే గంటా రాజీనామా చేయటం నిజమే. తన రాజీనామాను గంటా ఉపసంహరించుకోలేదు. కాబట్టి ఎప్పుడు ఆమోదించాలన్నది స్పీకర్ ఇష్టం. రాజ్యసభ ఎన్నికలకు, రాజీనామా ఆమోదానికి ముడిపెడితే కుదరదు. గంటా ఆరోపణ నిజమే అనుకున్నా దాన్ని టెక్నికల్ గా నిరూపించటం కష్టం. నిజం మాట్లాడితే అసలు గంటా రాజీనామాయే డ్రామాగా అప్పట్లోనే చాలా ఆరోపణలొచ్చాయి. ఉక్కుఫ్యాక్టరీ వ్యవహారానికి గంటాకు సంబంధమే లేదు. అయినా సరే ఎంఎల్ఏ రాజీనామా చేశారు.



ఎందుకు చేశారంటే రాబోయే ఎన్నికల్లో లబ్దికోసమే. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చే గంటా రాబోయే ఎన్నికల్లో చోడవరం లేదా గాజువాక నుండి పోటీకి రెడీ అవుతున్నారట. ఉక్కు ఫ్యాక్టరీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో లేదా ఎక్కడైనా సరే తన ఇమేజిని బిల్డప్ చేసుకుని గెలవాలని ఆలోచిస్తున్న ఎంఎల్ఏ సడెన్ గా మొదలైన  ఉక్కు ఆందళనను అడ్వాంటేజ్ తీసుకుకోవాలని అనుకున్నారట. అందుకనే తనకు సంబంధంలేకపోయినా రాజీనామా చేశారనే ఆరోపణలున్నాయి. కాబట్టి గంటా రాజీనామాకు అసలు కారణం వేరు, పైకి చెప్పిన కారణం వేరని అర్ధమవుతోంది. కాకపోతే రాజ్యసభ ఎన్నికలకు ముందు స్పీకార్ రాజీనామాను ఆమోదించటాన్ని గంటా తట్టుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: