అమరావతి : జగన్ ఓటుబ్యాంకుపై షర్మిల టార్గెట్ పెట్టారా ?

Vijaya

ఏ పార్టీకి అయినా సొంతంగా ఒక ఓటు బ్యాంకుంటుంది. ఆ ఓటుబ్యాంకును పదిలం చేసుకుంటూనే మిగిలిన వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేయటం సహజం. తెలుగుదేశంపార్టీని ఓన్ చేసుకునే వర్గం కమ్మ సామాజికవర్గం. వైసీపీని ఓన్ చేసుకుని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్తియన్ మైనారిటీలు. బీసీలు, కాపులు రెండురకాలుగా చీలిపోయాయి. రెడ్లలో రెండుపార్టీల మద్దతుదారులూ ఉన్నారు.



ఇక బీజేపీకి స్ధిరమైన ఓటుబ్యాంకంటు లేదు. కాంగ్రెస్, వామపక్షాల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తాజాగా జనసేనను కాపులు ఓన్ చేసుకుంటారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఏమి జరుగుతుందో చూడాలి. ఈ పరిస్ధితుల్లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకనే ఓటుబ్యాంకులను కన్సాలిడేట్ చేసుకోవటానికి పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అద్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకోగానే ఆమె జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, బీజేపీని డైరెక్టుగా ఎటాక్ చేశారు.



జగన్ పైన ఆమె చేసిన ఆరోపణల్లో ఎక్కువభాగం ఇప్పటివరకు చంద్రబాబు, పవన్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎల్లోమీడియా చేస్తున్నవే. అప్పులు, ప్రత్యేకహోదా సాధనలో ఫెయిలవ్వటం, పరిశ్రమలు లేవని, ఉద్యోగాలు కల్పించలేకపోయారని, మూడురాజధానుల పేరుతు రాష్ట్రాన్ని నాశనం చేశారనే ఆరోపణలన్నమాట. అయితే ఇక్కడే జగన్ను ఉద్దేశించి మరో విచిత్రమైన ఆరోపణ కూడా చేశారు. అదేమిటంటే క్రిస్తియన్ అయ్యుండి మణిపూర్లో క్రిస్తియన్లపై జరిగిన దాడులను జగన్ ఖండించలేదట.



చర్చిలపై జరిగిన దాడులకు, క్రిస్తియన్ల మరణాలకు కారణమైన బీజేపీకి జగన్ మద్దతిస్తున్నట్లు షర్మిల విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి షర్మిల జగన్ క్రిస్తియన్ అని నొక్కిచెప్పటంలో అర్ధమేంటి ? ఏమిటంటే క్రిస్తియన్ ఓటుబ్యాంకును వైసీపీకి దూరం చేయటమే అని అర్ధమవుతోంది. ఎలాగంటే షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్  క్రైస్తవమత బోధకుడే కాబట్టి. అనీల్ ద్వారా క్రైస్తవ ఓటుబ్యాంకులో చీలిక తీసుకురావటమో లేకపోతే గుండుగుత్తగా క్రిస్తియన్ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్ళించాలనే ఆలోచనలో క్రిస్తియన్ అయిన షర్మిల ఉన్నట్లు అర్ధమవుతోంది.


అయితే షర్మిల మరచిపోయిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. 2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో కొన్ని ఓట్లు పెరిగితే పెరగచ్చంతే. ఇంతమాత్రాన క్రిస్తియన్ ఓటుబ్యాంకు జగన్ను వదిలేసి షర్మిల+బ్రదర్ అనీల్ కారణంగా కాంగ్రెస్ వైపు మళ్ళుతుందని అనుకునేందుకు లేదు. క్రిస్తియన్ సంఘాలతో, చర్చిల్లోని ఫాదర్లతో బ్రదర్ ఎన్ని మీటింగులు పెట్టినా ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు.  మొత్తానికి షర్మిల టార్గెట్ అయితే స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: