రేవంత్‌రెడ్డి: అప్పుల పేరుతో గ్యారంటీలకు టాటా?

Chakravarthi Kalyan
గ్యారెంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా అని.. కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా అని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుండటంతో కేటీఆర్‌ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆ ప్రశ్నలు ఏమిటంటే.. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..?గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..? శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి
అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అంటున్న కేటీఆర్‌.. శాసనసభకు  సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా.. అంటున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని.. ఆడిట్ రిపోర్ట్‌ లు..ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు  లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయని కేటీఆర్ అంటున్నారు.

ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి..ప్రజల ముందువుంచామన్న కేటీఆర్.. మేం దాచింది ఏమీలేదు.. మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..! కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..! మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికిదివాలాకోరు స్టొరీలు చెప్పి... తప్పించుకోవాలని చూస్తారా...? అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం అంటున్నారు కేటీఆర్. చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే..! అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంచనాలు.. అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా.. వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: